Nellore Boat Accident: నెల్లూరు పడవ ప్రమాదంలో చెరువులో గల్లంతయినావారిలో ఐదుగురి మృతదేహాలు గుర్తించారు. జాలర్లు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. మొత్తం 10మంది చెరువులోకి వెళ్లగా నలుగురు యువకులు నిన్న రాత్రి ఈదుకుంటూ బయటకు వచ్చారు. గల్లంతయినా వారిలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం.
మంత్రి కాకాణి దిగ్భ్రాంతి..
పడవ ప్రమాదంలో చనిపోయినవారంతా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత ఊరివారు కావడంతో ఆయన హుటాహుటిన కేరళ పర్యటన మధ్యలోనే ముగించుకుని నెల్లూరు జిల్లాకు వచ్చారు. సహాయక చర్యలను ఆయన దగ్గర ఉండి పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ విజయరావుతో కలసి ఆయన ఆదివారం రాత్రి నుంచి సంఘటన స్థలం వద్దే ఉన్నారు. యువకుల మృతదేహాలను చూసి ఆయన చలించిపోయారు. తన సొంత కుటుంబంలో ఈ దుర్ఘటన జరిగినట్టు ఆ ప్రమాదం తనను కలచి వేసిందన్నారు.
ఊరంతా అలజడి..
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు గ్రామమంతా చెరువు దగ్గరకు తరలి వచ్చింది. ఒక్కో మృతదేహం బయటకు వస్తుండటంతో వారంతా కన్నీరు మున్నీరయ్యారు. చెరువు వద్దే వారంతా ఉన్నారు. మరొకరి కోసం గాలింపు జరుగుతోంది. గల్లంతయిన ఆరుగురిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో మిగిలిన వ్యక్తి కూడా జీవించి ఉంటాడనే ఆశలు సన్నగిల్లాయి. దీంతో ఆ గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది.
తోడేరు శాంతినగర్ గ్రామ చెరువులో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో 10 మంది యువకులు సరదాగా పడవలో వెళ్లారు. పడవలో షికారుకోసం వారంతా చెరువులోకి వెళ్లారు. దురదృష్టశాత్తు చెరువు మధ్యలోకి వెళ్లిన తర్వాత పడవలోకి నీరు రావడంతో కొంతమంది బయపడి బోటులోనుంచి దూకగా వారిలో నలుగురు ఈత కొట్టుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన 6 మంది గల్లంతయ్యారు. అందులో ప్రస్తుతం ఐదుగురి మృతదేహాలను గుర్తించారు. చెరువులో పడవలో విహారానికి వెళ్లినవారంతా ఒకే ఊరికి చెందినవారు కావడంతో శాంతి నగర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒడ్డుకు చేరిన నలుగురు ప్రమాద ఘటన నుంచి ఇంకా తేరుకోలేదు. వారంతా షాక్ లోనే ఉన్నారు.
పొదలకూరు మండలం, తోడేరు గ్రామం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంత ఊరు కావడంతో ఆయన ఈ ఘటన విషయంలో చొరవ తీసుకుని పోలీసులను ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చారు. మంత్రి కాకాణి ప్రస్తుతం కేరళలో అధికార పర్యటనలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన కేరళ పర్యటన మధ్యలోనే ఆపేసి ఆయన నెల్లూరుకి బయలుదేరి వచ్చారు. రాత్రి నుంచి ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం..
నెల్లూరు జిల్లాలో జరిగిన పడవ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకేసారి ఆరుగురు గల్లంతు కావడం, అందులో ఐదుగురు శవాలుగా తేలడంతో జిల్లాలో ఈ ఘటన విషాదంగా మారింది. జిల్లా మంత్రితోపాటు, జిల్లాకు చెందిన నాయకులు కూడా ఈ ఘటనపై తమ విచారం వ్యక్తం చేశారు. యువకులంతా సరదాగా చెరువులోకి వెళ్లడం, అక్కడే వారు మృత్యువాత పడటంతో తోడేరు గ్రామం కన్నీరుమున్నీరవుతోంది. ఎదిగొచ్చిన బిడ్డలు తమ కళ్లముందే శవాలుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.