నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు దాదాపుగా బయటకు వచ్చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ప్రయాణం టీడీపీతోనేనంటూ హింట్లిస్తున్నారు. ఆయన్ను టీడీపీ చేర్చుకుంటుందా, ఎక్కడి నుంచి పోటీ చేయిస్తుంది, ఎప్పుడు కండువా వేస్తుంది, ఆయన చేరికను స్థానిక టీడీపీ నాయకులు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా అనేది తర్వాత విషయం. చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన ధీమాతోనే సొంత పార్టీపై ఫోన్ ట్యాపింగ్ నిందలు వేసి, కోటంరెడ్డి బయటకు వచ్చారనేది బహిరంగ రహస్యం. మరి రెండో ఎమ్మల్యే ఆనం రూటు ఎటు..? ఆయన ఏం చేయాలనుకుంటున్నారు..? ఏ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నారు..? ఎవరితో సంప్రదింపులు జరిపారు..? ఇవన్నీ ప్రస్తుతానికి రహస్యమే.
ఆనం కూడా టీడీపీలోకే వెళ్తారనే ప్రచారం ఉన్నా కూడా ఆయన దానిని సమర్థించడంలేదు, వ్యతిరేకించడంలేదు. అదే సమయంలో ఆయన జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా బలంగా వినపడుతోంది. వీటన్నిటికీ మించి ఇప్పుడు ఆనం తన ఇంటిలో కాంగ్రెస్ నేతలకు టీకి ఆహ్వానించారు. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ సెక్రటరీ మయప్పన్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ సహా మరికొందరు నేతలు ఆనంను ఆయన ఇంటిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చాలాసేపు వారి మధ్య చర్చలు జరిగాయి. కాంగ్రెస్ నేతలను ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వడంలో ఆనం అంతరంగం ఏంటి.. ? ఇంతకీ ఆనం రూటు ఎటు..? టీడీపీపై ఒత్తిడి పెంచేందుకే ఆయన ఇలా అన్ని పార్టీల నేతలతో సమావేశం అవుతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఆనం రామనారాయణ రెడ్డి 2019లో అయిష్టంగానే వెంకటగిరి నుంచి పోటీ చేసారు. అదే సమయంలో ఆయన ఆత్మకూరు సీటు కావాలన్నారు కానీ, అక్కడ గౌతమ్ రెడ్డిని కాదని జగన్ టికెట్ ఇవ్వలేదు. పోనీ నెల్లూరు సిటీ లేదా రూరల్ అడిగినా అదీ కుదరలేదు. దీంతో వెంకటగిరి వెళ్లి వైసీపీ టికెట్‌పై గెలిచారు ఆనం, మరోసారి అక్కడి నుంచి ఆయనకు పోటీ చేసే ఆసక్తి లేదు. అందులోనూ ఆయన కుమార్తె ఆత్మకూరు నుంచి టీడీపీ తరపున పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దశలో ఆయన నెల్లూరు రూరల్ కి రావాలనుకున్నారు. కానీ అనూహ్యంగా కోటంరెడ్డి కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చి నెల్లూరు రూరల్ లో టీడీపీ టికెట్ పై పోటీ చేస్తానని చెప్పడంతో ఆనం సందిగ్ధంలో పడ్డారు. ఇప్పుడు ఆయనకు పార్టీతో పాటు తాను పోటీచేయబోయే సీటు విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
రెండు సీట్లు కావాల్సిందే..
ఈ దఫా ఆనం కుటుంబానికి రెండు సీట్లు కావాలంటున్నారు రామనారాయణ రెడ్డి. ఆ దిశగా టీడీపీపై ఒత్తిడి పెంచే ఆలోచనలో ఉన్నారు. టీడీపీలో ఆనంకి రెండు సీట్లు ఇస్తారు కానీ, ఆయన అడిగిన రూరల్ సీటు ఇవ్వడం కాస్త ఇబ్బందిగా మారే అవకాశముంది. రూరల్ లో కోటంరెడ్డి ఉన్నారు, ఆయన పార్టీలో చేరితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనకే ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ దశలో ఆనంకు సీటు సర్దుబాటు టీడీపీకి తలనొప్పిగా మారే అవకాశముంది. దీంతో ఆయన పార్టీ విషయంలో తర్జన భర్జన పడుతున్నారు. మరికొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుంది. ఈ లోగా ఆయన కాంగ్రెస్ నాయకులను కలవడం మాత్రం కొత్త ఊహాగానాలకు తావిస్తోంది.