తారకరత్న మరణానికి చంద్రబాబే పరోక్ష కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. చంద్రబాబు ఎక్కడ పాదం పెడితే అక్కడ ప్రాణాలు ఎగిరిపోతున్నాయని అన్నారు. చంద్రబాబు వల్లే నందమూరి కుటుంబానికి కష్టాలు వచ్చాయని చెప్పారు కాకాణి.


చంద్రబాబు ది ఐరన్ లెగ్ అంటూ మండిపడ్డారు మంత్ర కాకాణి గోవర్దన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో ఆరుగురిని పొట్టనపెట్టుకున్నారని, విజయవాడలో చీరలు పంచుతూ ముగ్గురి మరణానికి కారణం అయ్యారని, ఎక్కడికి వెళ్లినా బాబుకి అపశృతి అలవాటుగా మారిందని విమర్శించారు. చంద్రబాబు పరిపాలన దేవుడికి కూడా ఇష్టంలేదని చెప్పారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాక్కున్న చంద్రబాబుకి పార్టీని నడపడం కూడా చేతకాలేదన్నారు కాకాణి. చివరకు వైసీపీ గృహసారథుల కాన్సెప్ట్ ని కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు.


తారకరత్న మరణం తర్వాత వైసీపీ నేత లక్ష్మీపార్వతి కూడా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన రోజే.. తారకరత్న మరణించాడని, అయితే అప్పుడే ఆ వార్త ప్రకటిస్తే అది లోకేష్ పాదయాత్రకు అపశకునం అవుతుందని చంద్రబాబు దాన్ని అడ్డుకున్నారని ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు లక్ష్మీపార్వతి. కొడుకు పాదయాత్ర ఆగిపోతుందనే ఉద్దేసంతోటే తారకరత్న మరణ వార్తను బయటకు రానీయలేదని చెప్పారామె. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను కూడా తమ స్వార్ధ రాజకీయ కోసం చంద్రబాబు వాడుకున్నారని మండిపడ్డారు. కేవలం యువగళం పాదయాత్ర ఆగిపోకూడదనే ఉద్దేశంతోటే ఇన్నాళ్లూ తారకరత్నకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందంటూ అసత్యాలు ప్రచారం చేశారని విమర్శించారు లక్ష్మీపార్వతి. యువగళం పాద యాత్ర వాయిదా వేసుకోడానికి లోకేష్ ఇష్టపడలేదని, అందుకే ఇన్నిరోజులు ఆస్పత్రిలో తారకరత్నకు వైద్యం అందించినట్టు మభ్యపెట్టారని చెప్పారు.


ఇప్పుడు మంత్రి కాకాణి కూడా చంద్రబాబుపై ఇదే తరహా విమర్శలు సంధించారు. తారకరత్న మరణానికి పరోక్షంగా చంద్రబాబే కారణం అంటూ మండిపడ్డారు కాకాణి. చంద్రబాబు ఎక్కడ పాదం పెడితే అక్కడ భస్మాసురుడు లాగా మారాడన్నారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాగానే తారకరత్న చనిపోయారని, ప్రజలతో పాటు దేవుడు కూడా చంద్రబాబు పరిపాలన వద్దని కోరుకుంటున్నారని తేటతెల్లమయిందన్నారు. మోసం చేసి బతకడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారన్నారు కాకాణి. నీతి, నిజాయితీ అనేది చంద్రబాబులో ముచ్చుకైనా లేదన్నారు. తన కొడుకు లోకేష్ కు బాధ్యతలు అప్పగించేందుకు నానా అవస్థలు పడుతున్నారన్నారు.


ప్రభుత్వ సంక్షేమ పథకాలను గృహ సారధుల  ద్వారా ప్రతి ఇంటికి చేరేలా ప్రచార బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు కాకాణి. వైసీపీని మరింత బలోపేతం చేసే దిశగా గృహ సారధులకు సూచనలు అందిస్తున్నామన్నారు. చంద్రబాబు తమ గృహసారథుల కాన్సెప్ట్ ని కాపీ కొట్టారని చెప్పారు కాకాణి. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చేసారి కూడా వైసీపీ హయాంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెప్పారు కాకాణి. ప్రతి ఊరిలోనూ ప్రజలు తమ పార్టీ నేతలకు బ్రహ్మరథం పడుతున్నారని, గృహసారథుల కాన్సెప్ట్ కి మంచి స్పందన వస్తోందని చెప్పారు. గృహసారధులే వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయ సారథులని చెప్పారు కాకాణి.