ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో లక్షనుంచి 10లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో నెల్లూరుకి జాతీయ స్థాయిలో 60వ ర్యాంక్ లభించింది. వాస్తవానికి నెల్లూరుకి 80నుంచి 90మధ్య ర్యాంక్ వస్తుందని అనుకున్నారంతా. కానీ అంతకు మించి అంచనాలను దాటిపోయింది నెల్లూరు. ఏకంగా జాతీయ స్థాయిలో 60వ ర్యాంక్ సొంతం చేసుకుంది. రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ తో మెరుగైన స్థానంలో నిలబడింది. గతేడాదికంటే ఈ ఏడాది నెల్లూరు తన స్థానాన్ని మెరుగుపరచుకుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.
నెల్లూరుతోపాటు జిల్లాలోని ఆత్మకూరు, కందుకూరు, కావలి మున్సిపాల్టీలు కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకోసం పోటీ పడ్డాయి. అయితే నెల్లూరు మాత్రమే గతంకంటే మరింత మెరుగైన ర్యాంక్ సాధించింది. ఇటీవలే జిల్లాలో కలసిన కందుకూరు మున్సిపాల్టీ లక్షలోపు జనాభా విభాగంలో రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆత్మకూరు, కావలి మున్సిపాలిటీలు వరుసగా 27, 45 ర్యాంకులు దక్కించుకోవడం విశేషం.
సోషల్ మీడియా ద్వారా వివరాల సేకరణ..
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకం. ప్రజలు తమ అభిప్రాయాలు పంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రజాభిప్రాయం సేకరిస్తారు అధికారులు. అంటే సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం చేస్తే, ప్రజలను భాగస్వాముల్ని చేస్తే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే లో ర్యాంక్ మెరుగవుతుంది. దీనికి సంబంధించి నెల్లూరు నగరపాలక సంస్థ ఎక్కువ మంది ప్రజలను ఇలా సోషల్ మీడియా ద్వారా భాగస్వాములను చేసింది. నగరంలోని పలు చోట్ల క్యూ ఆర్ కోడ్ లతో కూడిన బ్యానర్లు, బోర్డ్ లు ఏర్పాటు చేసి, ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపేలా చొరవ తీసుకుంది. అభిప్రాయ సమర్పణను ఓ ఉద్యమంలా చేపట్టింది. దీంతో నెల్లూరుకి ఓటింగ్ మెరుగైంది.
ఇంటి నుంచి వ్యర్థాలు చెత్త సేకరణ బండి ద్వారా సేకరిస్తున్నారా? తడి, పొడి చెత్త వేరు చేసి సేకరిస్తున్నారా, ప్రతి రోజూ వాహనాల ద్వారా స్వచ్ఛగీతం వినిపిస్తున్నారా..? ప్రజా మరుగుదొడ్లు మీకు అందుబాటులో ఉన్నాయా.. అంటూ పది ప్రశ్నలకు సమాధానం చెప్పించి అభిప్రాయాలు సేకరించారు.
టాప్-10 లక్ష్యం..
ప్రస్తుతం నెల్లూరు నగరం జాతీయ స్థాయిలో 60వ స్థానంలో ఉంది. టాప్-10లో లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు నెల్లూరు అధికారులు. స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారించామంటున్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఈ ఏడాది మంచి ర్యాంకు సాధించామని, ఇదే స్ఫూర్తితో 2023లో పదిలోపు ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తామన్నారు నగరపాలక సంస్థ అధికారులు. డివైడర్ల మధ్యలో పూల మొక్కలతో పచ్చదనం మెరుగుపరచడం, ఇంటింటి నుంచిచెత్తను వందశాతం సేకరించి డస్ట్ బిన్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దుతామంటున్నారు.
ర్యాంకులకు, స్వచ్ఛతకు పోలిక ఉందా..?
ర్యాంకులు మెరుగైనంత మాత్రాన నగరం మొత్తం స్వచ్ఛంగా మారిపోతుందని కాదు. కానీ మెరుగైన ర్యాంకులతో ప్రజల్లోనూ, ప్రభుత్వ అధికారుల్లోనూ బాధ్యత పెరుగుతుంది. ఈ బాధ్యతతోనే మరింత మెరుగైన స్థానం చేరుకోగలరు. అందుకే కేంద్రం ఈ ర్యాంకులు ప్రకటిస్తోంది. ఏడాదికేడాది ర్యాంకులు మెరుగు పరచుకోడానికి అధికారులు కుస్తీ పడుతున్నారు.