నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి రైల్వే గేటు సమీపంలో కారుతో సహా కాలి బూడిదైపోయిన వ్యక్తి వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. మృతుడు మల్లికార్జున్ గా గుర్తించారు. కారులో కూర్చుని విండోస్ అన్నీ మూసేసుకుని సీటు బెల్ట్ పెట్టుకుని కారుతో సహా అగ్నికి ఆహుతైపోయినట్టు నిర్థారించారు. ఇది ఆత్మహత్యగా నిర్థారణకు వచ్చారు పోలీసులు.


నెల్లూరులో ఆర్కే జిరాక్స్ పేరుతో ఇతను ఓ జిరాక్స్ షాపు నడుపుతున్నాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. డీఎస్పీ హరినాథ్ రెడ్డి మృతుడి వివరాలు వెళ్లడించారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి ఎవరితోనూ గొడవలు లేవను, కుటుంబ కలహాల వల్ల ఈ దుర్ఘటన జరిగిందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. 


పోలీసుల కథనం ప్రకారం.. బుచ్చిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన మాలేటిపాటి మల్లికార్జున్‌(45) కొన్నాళ్లుగా నెల్లూరు నగరంలో ఆర్‌కే జిరాక్స్‌ షాపు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలోని విజయ మహల్‌ రైల్వేగేటు ప్రాంతంలో అద్దె ఇంట్లో కుటుంబంతో సహా నివశిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటికి వెళుతున్నట్లు చెప్పి దుకాణం నుంచి కారులో బయలుదేరాడు మల్లికార్జున్.


మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గొలగమూడి రైల్వేగేటు సమీపంలో మొగల్‌ చెరువుకు వెళ్లే మార్గం వద్దకు కారులో చేరుకున్నాడు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో కారు పార్క్ చేశాడు. రివర్స్ తీసుకుని కారుని చెట్ల వద్ద ఆపాడు. ఆ తర్వాత డ్రైవింగ్ సీట్లోనే ఉండి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా కారులో ఉవ్వెత్తున మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమందించారు. పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. 




కారును పరిశీలించగా డ్రైవింగ్‌ సీటులో ఉన్న వ్యక్తి మంటల్లో పూర్తిగా సజీవ దహనమైనట్లు గుర్తించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, సీఐ జగన్మోహన్‌ రావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. కారు రిజిస్ట్రేషన్‌ ఆధారంగా అది మల్లికార్జున్‌ కి చెందిన వాహనంగా గుర్తించారు. నెల్లూరు నగరంలోని ఆర్కే జిరాక్స్ దుకాణం వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి కారులో బయల్దేరారని సిబ్బంది తెలిపడంతో పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను తీసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 


అప్పటికే మల్లికార్జున్‌ దేహం పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా మారింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మల్లికార్జున్ అజాత శత్రువని, ఎవరితోనూ అతనికి గొడవలు లేవని, శతృత్వం లేదని చెబుతున్నారు పోలీసులు. వ్యాపారంలో నష్టాలేవైనా వచ్చాయా, కుటుంబ కలహాలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. 
Also Read: Sankranti Special Trains: సంక్రాంతికి మరో 10 ప్రత్యేక రైళ్లు ... దక్షిణ మధ్య రైల్వే ప్రకటన  
Also Read: Anantapur: కొజ్జేపల్లి.. ఛీఛీ ఈ పేరు మా ఊరికే పెట్టాలా, గ్రామస్తుల నరకయాతన.. ఆ కథేంటో మీకు తెలుసా..!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి