ఇటీవల అయ్యప్ప స్వాముల బస్సులకు ఘోర ప్రమాదాలు చూశాం. ఇది కూడా అలాంటిదే. అయితే ఆ ఘోరం తృటిలో తప్పిపోయింది. క్షణకాలం ఆలస్యం అయిఉంటే 42 మంది అయ్యప్ప స్వాముల పరిస్థితి ఏమయ్యేదో చెప్పలేం. కానీ నెల్లూరు జిల్లాలో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. స్వామి శరణం అంటూ బస్సుదిగి ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగింది. ఆ బస్సులో ఏమైంది..?


అసలేమైంది..?


కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన 42 మంది అయ్యప్ప స్వాములు మాలధారణ చేసి శబరిమలకు బయలుదేరారు. నెల 16న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుని వారు మాట్లాడుకున్నారు. శబరి యాత్ర మొదలైంది. దర్శనీయ ప్రాంతాలలో బస చేస్తూ వారు యాత్రకు బయలుదేరారు. గురువారం సాయంత్రం బస్సు నెల్లూరు జిల్లాకు చేరుకుంది. బోగోలు మండలంలోని కడనూతల చెరువు ప్రాంతానికి చేరుకునేసరికి బస్సు డ్రైవర్‌ భాస్కర్‌ రావు (38) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండె నొప్పి అనిపించింది. అప్పటికీ కొంత దూరం బస్సుని అలాగే నడిపాడు.


తీరా బస్సు కడనూతల వద్ద ఓ ఫ్లైవర్ పైకి వచ్చేసరికి బస్సు నడపలేకపోయారు భాస్కర్ రావు. బస్సుని ఓ రోడ్డుపక్కన ఆపేశారు. డ్రైవర్ సీటు వెనకే విశ్రాంతి తీసుకునే బల్లపై కూర్చున్నాడు. ఎక్కువసేపు కూర్చులేక అక్కడే పడుకున్నాడు. ఆ సమయానికి తన పరిస్థితి ఇదీ అని బస్సులో వెళ్లేవారికి కూడా ఆయన చెప్పలేకపోయారు. సడన్ గా బస్సు రోడ్డుపక్కన ఆపేసే సరికి స్వాములు డ్రైవర్ సీటు వద్దకు వచ్చారు. అప్పటికే భాస్కర్ రావు గుండె నొప్పితో అవస్థ పడుతున్నారు. వారు భాస్కర్ రావు వద్దకు వచ్చి పలకరించారు. అప్పటికే ఆయనలో ఉలుకూ పలుకు లేదు. పడుకున్న వ్యక్తి పడుకున్నట్టుగానే ప్రాణాలు వదిలాడు.


మా ప్రాణాలు కాపాడి..


బస్సు నడుపుతూ డ్రైవర్ అస్వస్థతకు గురైతే ఆ బస్సు ఎక్కడో ఒకచోట ఢీకొని ఆగిపోయిన ఉదాహరణలు ఇటీవల కాలంలో చాలానే ఉన్నాయి. కానీ ఈ డ్రైవర్ ఆలా కాదు. తనకి ఉన్న ఇబ్బందిని ముందే పసిగట్టాడు. బస్సుని నడిపితే తనతోపాటు ప్రయాణికులు కూడా ఇబ్బంది పడతారనే అవగాహనకు వచ్చాడు. వెంటనే బస్సుని రోడ్డు పక్కన ఆపేశాడు. ఆయన వెనక సీట్లో కుప్పకూలి చనిపోయాడు.




భాస్కర్ రావు మృతదేహం తరలింపు..


భాస్కర్‌రావు మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన విశాఖపట్నం జిల్లా కె.కోటపాడు మండలం, ఎ.కోడూరుకు అంబులెన్స్ లో తరలించారు స్వాములు. బస్సు యాజమాన్యానికి ఫోన్ చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. 42మంది స్వాములు భాస్కర్ రావే తమ ప్రాణాలను కాపాడారని, ప్రమాదం జరక్కుండా నివారించారని అంటున్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నెల్లూరు జిల్లాతో పాటు అయ్యప్ప స్వాములు బయలుదేరిన కాకినాడ జిల్లావాసులు కూడా ఈ వార్త తెలుసుకుని ఆందోళనకు గురయ్యారు. స్వాములకు వారి కుటుంబ సభ్యులు ఫోన్లు చేసి ఆరా తీసారు. భాస్కర్ రావు కుటుంబానికి కూడా స్వాములు అండగా ఉంటామని చెప్పారు.