నెల్లూరు జిల్లా కోర్టులో జరిగిన దొంగతనం వ్యవహారంపై సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. మంత్రి కాకాణి ముద్దాయిగా ఉన్న కేసులో కీలక పత్రాలు మాయం అయ్యాయని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. నేరుగా ఆ కేసులో ఉన్న సాక్ష్యాలనే దొంగలు మాయం చేయాలని చూడటంతో పోలీసులు వెంటనే దానిపై దృష్టిపెట్టారు. అయితే హైకోర్టు ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ విచారణను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు మంత్రి కాకాణి. నెల్లూరు నగరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, సీబీఐ విచారణపై స్పందించారు.


బాబులా భయపడేది లేదు..


సీబీఐ విచారణను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. నీతి నిజాయితీ ఉంది కాబట్టే తమ ప్రభుత్వం సీబీఐ విచారణకు అభ్యంతరం లేదని చెప్పారు. గతంలో కూడా తాను సీబీఐ ఎంక్వయిరీ కోరినట్టు ఆయన గుర్తు చేశారు. సీబీఐ విచారణతో  అయినా వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు కాకాణి. ఈ విచారణతో అయినా విమర్శించే టీడీపీ నేతల నోళ్లు మూతబడతాయన్నారు. తాను చంద్రబాబులా సీబీఐ విచారణకు భయపడటంలేదని చెప్పారు కాకాణి.


బాబుకి ఆ ధైర్యం ఉందా..


చంద్రబాబు కూడా ఏమాత్రం దమ్ము ధైర్యం ఉంటే ఆయనపై ఉన్న కేసుల్లో సీబీఐ విచారణకు సిద్ధం కావాలన్నారు కాకాణి గోవర్దన్ రెడ్డి. సీబీఐ విచారణ అంటే కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్న నీచ సంస్కృతి చంద్రబాబుది అని అన్నారు కాకాణి. ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు సత్యంగా ఉండాలని, అందుకే సీబీఐ విచారణకు తాను అభ్యంతరం తెలపడంలేదని చెప్పార. చంద్రబాబు లాగా తాను భయపడి పారిపోవట్లేదని, ఏ తప్పు చేయలేదు కాబట్టే.. ధైర్యంగా హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.


 అసలేం జరిగింది? 


ప్రస్తుతం మంత్రిగా ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డి గతంతో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, తనకు వ్యతిరేకంగా ఫోర్జరీ పత్రాలను సృష్టించారంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నెల్లూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించిన ఆధారాలున్న బ్యాగ్‌ నెల్లూరు జిల్లా కోర్టులో ఉంది. ఆ బ్యాగ్ ని ఈ ఏప్రిల్ లో దొంగలు చోరీ చేశారు. అయితే బ్యాగ్‌లోని పత్రాలను కోర్టు బయటే పడేసి వెళ్లారు. ఈ పని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డే చేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. నెల్లూరు కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసును సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో పోలీసులు సరిగా దర్యాప్తు చేయడం లేదని, సీబీఐకి అప్పగించడం మంచిదని నెల్లూరు జిల్లా న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కేసును సీబీఐకి ఇచ్చినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరాం కూడా హైకోర్టుకు స్పష్టం చేశారు. దాంతో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం వెల్లడించింది.