నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు గ్రామానికి సమీపంలోని గ్రామ చెరువులో పడవలో షికారుకి వెళ్లిన 10మంది గల్లంతయిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వీరిలో నలుగురు సురక్షితంగా ఒడ్డుకి చేరుకోగా, ఆరుగురు చెరువులో మునిగిపోయినట్టు తెలుస్తోంది. ఆరుగురు ప్రాణాలతో బయటపడతారా లేదా అని గ్రామస్తులు, బంధువులు అక్కడే మకాం వేశారు. పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు జరుగుతోంది.


తోడేరు శాంతినగర్ గ్రామ చెరువు లో  సాయంత్రం 5 గంటల సమయంలో 10 మంది యువకులు సరదాగా పడవలో వెళ్లారు. వారంతా దాదాపు 25 సంవత్సరాలు వయసు గలవారని తెలుస్తోంది. దురదృష్టశాత్తు చెరువు  మధ్యలోకి వెళ్లిన తర్వాత పడవలోకి నీరు రావడంతో  కొంతమంది బయపడి బోటులోనుంచి దూకగా వారిలో 4గురు ఈత కొట్టుకుంటూ  సురక్షతంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన  6 మంది గల్లంతయ్యారు.


గల్లంతైన వారి వివరాలు....



  1. పముజుల బాలాజీ వయసు 20 సంవత్సరాలు

  2. బట్టా రఘు (25)

  3. 3. అల్లి శ్రీనాథ్ (16)

  4. మన్నూరు కళ్యాణ్ (30)

  5. చల్లా ప్రశాంత్ కుమార్ (26)

  6. పాటి సురేంద్ర (16)


చెరువులో పడవలో విహారానికి వెళ్లినవారంతా ఒకే ఊరుకి చెందినవారు కావడంతో శాంతి నగర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒడ్డుకు చేరిన నలుగురు ప్రమాద ఘటన నుంచి ఇంకా తేరుకోలేదు. వారంతా షాక్ లోనే ఉన్నారు. మిగిలిన ఆరుగురికోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పడవ ప్రమాదం, అందులోనూ ఒకేసారి ఆరుగురు గల్లంతు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది.


తోడేరు పడవ ప్రమాదంపై మంత్రి కాకాణి ఆరా..


పొదలకూరు మండలం, తోడేరు గ్రామం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంత ఊరు కావడంతో ఆయన ఈ ఘటన విషయంలో చొరవ తీసుకుని పోలీసులను ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చారు. సొంత గ్రామస్తులు కావడంతో కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆవేదనలో మంత్రి కాకాణి ఉన్నారని తెలుస్తోంది.


మంత్రి కాకాణి ప్రస్తుతం కేరళలో అధికార పర్యటనలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన నెల్లూరుకి పయనమయ్యారాయన. నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో పాటు జిల్లా ఎస్పీ విజయ రావుతో సహా పలువురు ఉన్నతాధికారులతో మంత్రి కాకాణి ఎప్పటికప్పుడు సహాయక చర్యల తీరుని అడిగి తెలుసుకుంటున్నారు.


నెల్లూరు బ్యారేజీలో మహిళ మృతదేహం..


మరోవైపు నెల్లూరు బ్యారేజి లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడం కూడా నెల్లూరులో కలకలం రేపింది. మహిళ ఆత్మహత్యకు పాల్పడిందా, లేక ఎవరైనా చంపి శవాన్ని బ్యారేజీలో పడేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహం లభ్యంపై సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్నారు సంతపేట పోలీసులు.


ఒకేరోజు నెల్లూరులో పడవ ప్రమాదంలో ఆరుగురు గల్లంతయ్యారు. అదే రోజు పెన్నా నదిలో మహిళ మృతదేహం పడి ఉంది. వరుస దుర్ఘటనలతో నెల్లూరు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది గతంలో.. నెల్లూరు జిల్లాలో చెరువుల్లో ఈతకు వెళ్లి యువకులు మృత్యువాత పడిన సందర్భాలున్నాయి. కానీ ఒకేసారి పదిమంది పడవలో వెళ్లి గల్లంతు కావడం, వారిలో ఆరుగురి ఆచూకీ కనిపించకపోవం సంచలనంగా మారింది.