నెల్లూరులో వైసీపీ రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాల విభజనతో మొదలైన అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు బయటపడ్డాయి. జిల్లాల విభజన సహేతుకంగా లేదంటూ కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, అదే సమయంలో మూడు మండలాల ప్రజలు కష్టపడతారని చెప్పారు. గతంలో రాపూరు నియోజకవర్గాన్ని విభజించిన సమయంలో ఓసారి అన్యాయం జరిగిందంటూ పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రస్తావన తెచ్చారు. దీంతో కచ్చితంగా నేదురుమల్లి వర్గం నుంచి కౌంటర్ పడుతుందని అనుకున్నా.. అప్పటికప్పుడు అది సాధ్యం కాలేదు. తాజాగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy)కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వెంకటగిరి ప్రజలు బాలాజీ జిల్లాలో కలవడం వల్ల ఇబ్బంది పడరని, ప్రజల్లో వ్యతిరేకత లేదని, ఇది కేవలం ఆనం మైండ్ గేమ్ అని మమండిపడ్డారు. మంత్రిగా ఉన్నప్పుడు ఆనం ఆయా ప్రాంతాలను ఏమాత్రం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ టికెట్ పై తర్జన భర్జనలు జరిగాయి. అప్పటివరకూ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి స్థానికంగా ప్రచారం చేసుకున్నారు, తానే అభ్యర్థిని అని భావించారు. కానీ చివరి నిముషంలో అధిష్టానం ఆనం రామనారాయణ రెడ్డిని అక్కడికి పంపించింది. ఆనం ఆత్మకూరు టికెట్ ఆశించినా అది కుదరకపోవడంతో వెంకటగిరి పంపించారు. టికెట్ దక్కని బొమ్మిరెడ్డి టీడీపీలోకి వెళ్లారు. అదే సమయంలో వెంకటగిరినుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి (Nedurumalli Ram Kumar Reddy) కూడా వైసీపీనుంచి టికెట్ ఆశించారు. ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆయన తనకి టికెట్ వస్తుందని భావించారు. కానీ ఆనం రాకతో రామ్ కుమార్ రెడ్డి కూడా ఆనంకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత వైసీపీ.. రామ్ కుమార్ కి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గా పదవి ఇచ్చింది. నేదురుమల్లి వర్గానికి చెందిన కొంతమంది స్థానిక నాయకులకు కూడా జగన్ పదవులిచ్చారు. అయితే రామ్ కుమార్ వర్గాన్ని మాత్రం ఆనం స్థానికంగా దూరం పెట్టారు.
ఇప్పడు సమయం వచ్చింది, ఆనం వర్గాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తూ నేదురుమల్లి వర్గం రంగంలోకి వచ్చింది. వాస్తవానికి ఆనం జిల్లాల గొడవ మొదలు పెట్టినప్పుడే వైసీపీ నుంచి కౌంటర్ గా ప్రెస్మీట్ పెట్టాలనుకున్నారు నాయకులు. కానీ జగన్ వారిని వారించినట్టు తెలుస్తోంది. ఆనంను వ్యతిరేకించి సమస్యను పెద్దది చేయొద్దని, లైట్ తీసుకోవాలని చెప్పారట. తీరా ఇప్పుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆనంపై విరుచుకుపడటంతో కలకలం రేగింది.
జగన్ సపోర్ట్ తోనే రామ్ కుమార్ ఫైర్ అయ్యారా..?
రాపూరు నియోజకవర్గ విభజన సమయంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆనం కుటుంబాన్ని, ఆనం రాజకీయాలను టార్గెట్ చేశారంటూ పరోక్షంగా రామనారాయణ రెడ్డి ప్రస్తావించారు. దీనికి రామ్ కుమార్ కౌంటర్ ఇచ్చారనుకున్నా.. భవిష్యత్తులో వెంకటగిరి నియోజకవర్గంపై పట్టుపెంచుకోడానికే రామ్ కుమార్ రెడ్డి ఇంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారని అంటున్నారు. జగన్ మద్దతు ఆయనకు పూర్తిగా ఉందని తెలుస్తోంది.