Nagababu in Nellore: వైసీపీ మంత్రులపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు హాట్ కామెంట్స్ చేశారు. హాఫ్ బ్రెయిన్ మంత్రులంటూ ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లాలో రెండు రోజుల పర్యటనకోసం వచ్చిన ఆయన.. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో మాట్లాడారు. సమన్వయంతో ముందుకు కదలాలని, జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వారికి పిలుపునిచ్చారు. అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం సంక్షేమ పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు ఖాళీ చేసిందని.. ఆ ఖాళీని భర్తీ చేయాలంటే కనీసం దశాబ్దాల కాలం పడుతుందని అన్నారు నాగబాబు. జనసేన-టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి గానే సంక్షేమంతో పాటు ఏపీ అభివృద్ధిపై దృష్టి పెడతామని హామీ ఇచ్చారు. 


హాఫ్ బ్రెయిన్..
దేవాలయంలాంటి శాసన సభలో బూతులు మాట్లాడటం, స్టేజ్ మీద డ్యాన్స్ లు వేయడం తప్ప వైసీపీ నాయకులకు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు నాగబాబు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని తామెక్కడా చూడలేదన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు సజ్జల స్క్రిప్ట్ ఇస్తే.. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతల్ని తిడుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం ఆదేశాలతోనే తాము అలా చేస్తున్నట్టు వారే ఒప్పుకున్నారని చెప్పారు నాగబాబు. 


అనిల్ పై సెటైర్లు.. 
మాజీ మంత్రి అనిల్ గతంలో పోలవరంపై చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు నాగబాబు. జిల్లాకు చెందిన ఓ నేత గతంలో పోలవరాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామన్నారని, తొందరెందుకంటూ వ్యంగ్యంగా మాట్లాడారని, ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే నిరుద్యోగం ఏర్పడిందని, కానీ ఎక్కువమంది చదువుకోవడం వల్ల నిరుద్యోగం అంటూ వైసీపీ నేతలు కొత్త భాష్యం చెబుతున్నారని కౌంటర్ ఇచ్చారు నాగబాబు. 


వైనాట్ 175.. అంత సీన్ ఉందా..?
సీఎం జగన్ సహా వైసీపీ నేతలు వైనాట్ 175 అంటున్నారని, దేవుడే దిగి వచ్చినా ఏ ఒక్క పార్టీ అన్ని స్థానాల్లో గెలవలేదని చెప్పారు నాగబాబు. అలాంటిది ప్రజల్ని పట్టిపీడించే రాక్షసగణం వైసీపీ అన్నిచోట్లా గెలుస్తుందంటే ఎవరు నమ్ముతారని చెప్పారు. ప్రభుత్వం మారాక ప్రజా ధనం కొల్లగొట్టిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ వల్ల ఇబ్బందులు పడినవారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 


100రోజుల పోరాటం..
ఎన్నికలకు ఇంకా 100 రోజులే టైమ్ ఉందని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అందరూ కలసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు నాగబాబు. వైసీపీ పెట్టిన అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దని, లక్షకోట్లు దోచేస్తేనో, హత్యలు చేస్తేనో.. ఎవరూ నాయకులు కారని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడినందుకే జనసైనికులపై కేసులు పెడుతున్నారని, అంటే మనం ఒక మెట్టు పైకి ఎదిగినట్టే లెక్క అని అన్నారు నాగబాబు. కేసులకు భయపడొద్దని ధైర్యం చెప్పారు. జనసేనకు బలమైన న్యాయవిభాగం ఉందని, అన్నీ వారు చూసుకుంటారని భరోసా ఇచ్చారు. ఓపికతో, సహనంతో రాజకీయం చేయాలన్నారు. రెండురోజులపాటు నాగబాబు నెల్లూరులో పర్యటిస్తారు. ఈరోజు కూడా ఆయన జనసేన నేతలతో సమావేశం అయ్యారు. జిల్లాలో నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని ఆయన ఉద్భోదించారు.