Andhra Pradesh Politics: ఉమ్మడి ప్రకాశం జిల్లా మేదరమెట్లలో వైసీపీ (Ysrcp) సిద్ధం నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేతలు సిద్ధం సభకు హాజరవుతున్నారు. లక్షల మంది జనం వస్తుండటంతో ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలోనే చేశారు. అయితే అదే జిల్లాకు చెందిన కందుకూరు (Kandukur)నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి (Manugunta Mahidhar Reddy)మాత్రం సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండలస్థాయి నేతలు సిద్ధం సభకు హాజరుకాకూడదని మూకుమ్మడిగా డిసైడయ్యారు. కందుకూరు అసెంబ్లీ టికెట్ ను మధుసూదన్ యాదవ్ కు ఇవ్వడంతో మానుగుంట మహీధర్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎం.మహీధర్‌రెడ్డికి టికెట్‌ నిరాకరించడంతో మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు అసంతృప్తిగా ఉన్నారు. మరో వారం రోజులపాటు వేచి చూసిన తర్వాత...మానుగుంట మహీధర్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేయాలని నేతలు భావిస్తున్నారు. 


నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మానుగుంట
మానుగుంట మహీధర్ రెడ్డి 1989లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.  1989లో తొలిసారి కందుకూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి...టీడీపీ అభ్యర్థి మోరుబోయిన మాలకొండయ్య 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది...అసెంబ్లీ అడుగుపెట్టారు. 1994, 1999 ఎన్నికల్లో మాజీ మంత్రి దివి శివరామ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో దివి శివరామ్ నుంచి ఓడించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. కందుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి...అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి పోతుల రామారావును ఓడించి...నాలుగోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొత్తంగా మానుగుంట మహీధర్ రెడ్డి 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున, 2019లో వైసీపీ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం మానుగుంటకు టికెట్ నిరాకరించింది. 


టీడీపీ రావాలని ఆహ్వానించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉండటంతో...టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మానుగుంట మహీధర్ రెడ్డిని కలిశారు. తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ ఉన్న సమయంలోనూ...కందుకూరు సీటు వ్యవహారంలో వైసీపీ హైకమాండ్ తో విభేదించారు. మానుగుంటకు సీటు ఇవ్వకపోవడాన్ని తప్పు పట్టారు. తనకు చెప్పకుండా కందుకూరు సమన్వయర్తను మార్చడంతోనే...ఆయన టీడీపీ గూటికి చేరిపోయారు. 


లక్షలమంది జనంతో సిద్ధం సభలు
మరోవైపు వైసీపీ ఎన్నికల ముందు బలప్రదర్శనకు దిగుతోంది. వరుసగా సిద్ధం సభలను నిర్వహిస్తూ...ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసేందుకు ప్రయత్నిస్తోంది. జనవరి 27న విశాఖ జిల్లా భీమిలి, ఫిబ్రవరి 3న ఏలూరు జిల్లా దెందలూరు సిద్ధం సభలను నిర్వహించింది. ప్రతి సభకు 50 నియోజకవర్గాలకు సంబంధించిన కేడర్‌ వచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 18న అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మూడో సిద్ధం సభ నిర్వహించింది. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల, పిచ్చుకుల గిడిపాడు జాతీయ రహదారి పక్కన సిద్దం సభ నిర్వహిస్తోంది.