శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రభుత్వం ఎంత అణిచి వేసినా వెనుకడుగు వేయబోమని చెప్పారు. ఇక నుంచి ముందస్తు హెచ్చరికలు లేకుండా గెరిల్లా తరహాలో ఉద్యమాలు చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. హౌస్ అరెస్ట్ అయిన సందర్భంలో ఆయన తన ఇంటిలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. 




నెల్లూరు నగరంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన చర్చి పాస్టర్లు, వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే కోటంరెడ్డికి మద్దతు తెలిపారు. ఆయన తన ఇంటిలోనే ఉన్నారు. పాస్టర్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఆయన పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధనకోసం పోరాటం చేస్తున్న కోటంరెడ్డి ఉద్యమాన్ని పోలీసులు అడ్డుకోవడం తగదంటున్నారు పాస్టర్లు. 


పోలీసుల్ని పెట్టి తనని అడ్డుకున్నా, ఉద్యమం మాత్రం ఆపేది లేదంటున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ప్రభుత్వంపై, అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. ప్రజా ఉద్యమాలను పోలీసులు ఆపలేరన్నారు. దుర్మార్గంగా తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు ప్రశ్నించడమే నేరమా అన్నారు. 


దర్గాకు 15కోట్లు.. అంతకు మించి ఏం చేశారు..?
ఇప్పటి వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి బారా షాహీద్ దర్గా అభివృద్ధికి రూ.15 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని, అది మినహా మరో పని చేయలేదని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. క్రిస్టియన్ల కోసం వారి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరుతున్నానన్నారు. వేలాది మందికి ఉపయోగపడే పని చేయమంటే ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. 


గత నాలుగేళ్లలో 2019లో ఒకసారి, 2021లో ఒకసారి, 2022లో ఒకసారి, స్థానిక ఎమ్మెల్యేగా సీఎం జగన్ ని కలసి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 6 కోట్ల రూపాయల నిధులు మంజూరు కోసం 3 సార్లు సంతకాలు చేయించానని, అయినా పని కాలేదని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. సాక్షాత్తూ సీఎం మూడు సార్లు సంతకాలు చేసినా అతీగతీ లేదన్నారు. నెల్లూరులోని వేదాయపాళెం, గాంధీ నగర్‌లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం 150 అంకణాల స్థలాన్ని కేటాయించేలా చూశామని, అక్కడ నిర్మాణాలకోసం నిధులు మంజూరు చేయడం లేదన్నారు. ప్రభుత్వం నిధులివ్వకపోగా.. చర్చిలనుంచి ఇటుక ఇటుక సేకరించి తమ నిరసన తెలియజేస్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు కోటంరెడ్డి. ఇకపై ముందస్తు సమాచారం లేకుండా మెరుపు ధర్నాలకు దిగుతామని, గెరిల్లా తరహా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. 




మరోవైపు కోటంరెడ్డి హౌస్ అరెస్ట్ కి నిరసనగా ఆయన ఇంటికి స్థానిక నాయకులు పోటెత్తుతున్నారు. వామపక్షాల నాయకులు ఆయన్ను కలసి పరామర్శించారు. అటు క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన పాస్టర్లు, ఇతర మత పెద్దలు కూడా కోటంరెడ్డిని పరామర్శించేందుకు ఇంటికి వస్తున్నారు. ఆయన ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాట్లలో పోలీసులు బిజీ అయిపోయారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాత్రం ఇంటి బయటకు పంపించేందుకు అనుమతించలేదు పోలీసులు.