నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తగ్గేదే లేదంటున్నారు. పదే పదే అదే డైలాగ్ చెబుతున్న ఆయన, అది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే అనుకోవద్దని, ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలని చెబుతున్నారు. తాజాగా ఆయన ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. కలెక్టరేట్ వద్ద ధర్నాకు మహూర్తం పెట్టారు. ఆ తర్వాత ఆర్ అండ్ బి ఆఫీస్ ముందు కూడా ధర్నా చేపడతానన్నారు.


రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పటి వరకూ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ వచ్చిన ఆయన, తాజాగా తన ప్రెస్ మీట్ లో ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. నెల్లూరు రూరల్ లో సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న కలెక్టరేట్ ముందు ఈనెల 25న ఆర్ అండ్ బీ కార్యాలయం వద్ద నిరసన ధర్నాకి రంగం సిద్ధం చేశారు.


ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తుకి డిమాండ్..


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని కేంద్ర హోం శాఖకు లేఖ రాశానని చెప్పారు కోటంరెడ్డి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కి లేఖ రాస్తున్నానని చెప్పిన ఆయన, అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకాక నేరుగా కలిసి మాట్లాడుతానన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం కూడా తిట్లు, శాపనార్ధాలు పెట్టడం పక్కనపెట్టి, ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేపట్టాలని కేంద్రాన్ని కోరితే మంచిదన్నారు.


తాను ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజాసమస్యలపై పోరాడానని గుర్తు చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. స్వయంగా ముఖ్యమంత్రికే నిధులు విడుదల కావడం లేదని తాను చెప్పానని, ఆయనే సంతకాలు పెట్టినా పనులు జరగలేదన్నారు. గత ప్రభుత్వంలో భూగర్భ డ్రైనేజి, త్రాగునీరు కోసం రోడ్లు ధ్వంసం చేశారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్ అన్నీ వదిలేసి వెళ్ళిపోయారన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక రోడ్ల గురించి మంత్రి బొత్సకి వివరిస్తే ఆయన 2021 డిసెంబర్ లోగా అన్నీ సర్దుబాటు చేస్తామన్నారని, సమయం గడచిపోయినా పనులు కాలేదన్నారు. కాంట్రాక్టర్ కి గట్టిగా చెప్పి 10 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తే రూరల్ లో రోడ్లు పూర్తవుతాయని చెప్పారు కోటంరెడ్డి.


నెల్లూరులో డీకే డబ్ల్యూ కాలేజీ నుంచి పొదలకూరు రోడ్డు వరకు ఒకవైపే రోడ్డు వేసి వదిలేశారని, అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి ప్రధానమైన సమస్య అని గుర్తు చేశారు. అక్కడ కూడా రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సీఎం జగన్ వచ్చినప్పుడు కూడా ఆ ప్రాంతాన్ని ఆయనకు చూపించామని, స్వయంగా ఆయనే 28 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామన్నారని చెప్పారు. ఈరోజుకి కూడా టెండర్లు పిలవలేదన్నారు. గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని కోరామని.. ముస్లిం, దళితుల, గిరిజనుల విద్యార్థులకి ఉపయోగపడుతుందని విన్నవించామన్నారు. నెల్లూరు రూరల్ లో చిన్న చిన్న పనులు చేస్తే సమస్య పరిష్కారం అవుతాయని, కానీ నిధులు విడుదల కావడం లేదన్నారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, గణేష్ ఘాట్ సుందరీకరణకి 15 కోట్లు కేంద్ర నిధులు విడుదల అయ్యాయని, వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేయలేదన్నారు. తనపై కోపంతో పనులు ఆపేయవద్దని, త్వరగా పనులు చేయించాలన్నారు. బారా షాహిద్ దర్గాలో ఓ మసీదు ఉండాలని, దర్గా అభివృద్ధి జరగాలని ముస్లింల కోరికను జగన్ దృష్టికి తీసుకెళ్లామని, రొట్టెల పండుగ జరిగే దర్గాకోసం 15 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి ఆగస్టు లో జీఓ ఇచ్చారని, ఆ నిధులు ఇంకా విడుదల కాలేదన్నారు.


సమస్యల పరిష్కారం కోసం అధికార ఎమ్మెల్యే గా అధికారుల చుట్టూ తిరిగానని, ఆరోజు సమస్యల కోసం పోరాటం చేశా, ప్రజల పక్షాన ఈరోజు నుంచి పోరాటం మొదలు పెడుతున్నానని అన్నారు కోటంరెడ్డి. ఈ నెల 17న ఉదయం 11 గంటలకి జిల్లా కలెక్టరేట్ వద్ద ముస్లిం సోదరులతో కలిసి నిరసన ధర్నా చేపడతామన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. 25వ తేదీన ఆర్అండ్ బి కార్యాలయం వద్ద రోడ్ల కోసం ధర్నా చేస్తామన్నారు. ఆలోగా నిధులు విడుదల చేస్తే మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రికి, అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తామన్నారు. తనకు అనేక బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయని, చెప్పలేని భాషలో దుర్భాషలు ఆడుతున్నారన్నారు. బోరుగడ్డ అనిల్ ఆఫీస్ తగలబెట్టింది తాను కాదని, తనకు అంత శక్తి లేదన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఒకవేళ తన పేరు మీద ప్రచారం జరిగితే, అంతకంటే కావాల్సిందేముందన్నారు.