నెల్లూరులో వైసీపీ అంతర్గత రాజకీయాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాదాపుగా వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక మిగిలినవారిలో కూడా ఎవరి మధ్య ఎంత సఖ్యత ఉందనేది తేలాల్సి ఉంది.
నెల్లూరు సిటీ విషయానికొస్తే అక్కడ ఇప్పటికే గ్రూపు తగాదాలు జోరుగా నడుస్తున్నాయి. ఎమ్మెల్యే అనిల్ వర్గం ఓవైపు, ఆయనకు వ్యతిరేకంగా ఆయనకు బాబాయి వరసయ్యే రూప్ కుమార్ యాదవ్ వర్గం మరోవైపు రాజకీయాలు చేస్తున్నారు. రూప్ కుమార్ యాదవ్ ప్రస్తుతం నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఆయనతోపాటు నెల్లూరు నగరానికి చెందిన ఆర్యవైశ్య నేత ముక్కాల ద్వారకానాథ్ కూడా అనిల్ వ్యతిరేక గ్రూపులో చేరారు. ఈ ఇద్దరూ ఇటీవల కోటంరెడ్డికి బాగా సన్నిహితంగా ఉన్నవారే. వైసీపీలో ఆయన చాప్టర్ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు కాస్త సైలెంట్ గా ఉంటున్నారు. అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి.. అనిల్ వ్యతిరేక గ్రూపుని ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం ఉంది.
తాజాగా అనిల్ వ్యవహారంలో మరో ఆరోపణ వచ్చింది. అప్పట్లో మంత్రి పదవి వచ్చిన తర్వాత కాకాణి గోవర్దన్ రెడ్డి ఫ్లెక్సీలను నెల్లూరులో అనిల్ చించివేయించారనే అపవాదు ఉంది. తాజాగా ఆర్యవైశ్య నేత ముక్కాల ద్వారకానాథ్ ఫ్లెక్సీలకు అనిల్ మనుషులు స్టిక్కర్లు అంటించారని ఓ మీడియా ఛానెల్ లో కథనాలు వచ్చాయి. దీనిపై అనిల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనిల్ ఆర్యవైశ్యుల్ని అవమానించారని, ఆయన క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్లు వినిపించడంతో అనిల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ వ్యాఖ్యల్ని ఖండించారు.
అనిల్ ప్రెస్ మీట్ తో మళ్లీ నెల్లూరులో పొలిటికల్ హీట్ పెరిగినట్టయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డు పెట్టుకుని అనిల్ కావాలనే వారి ఫొటోలపై స్టిక్కర్లు అంటించారని ఓ మీడియా ఛానెల్ వార్తలు ప్రసారం చేసింది. దీనిపై అనిల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డబ్బులు తీసుకుని వార్తలు రాస్తున్నారని, అలా వార్తలు రాయించిన వెధవలు ఎవరో కూడా తనకు తెలుసన్నారు. అన్నిటికీ తనదే బాధ్యత అంటే ఎలా అని ప్రశ్నించారు. పోకిరి సినిమాలో లాగా పద్మావతి హ్యాపీయేనా అంటూ ఓ మీడియా ఛానెల్ రిపోర్టర్ కి చురకలంటించారు అనిల్. సదరు ఛానెల్ రిపోర్టర్ కట్టించుంటున్న ఇంటికి తనపై తప్పుడు కథనాలు రాస్తూ ఒక్కో వస్తువు చేరవేసుకుంటున్నారని చెప్పారు. పనిలో పనిగా సొంత పార్టీ నేతలపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అనిల్. అందరి పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉందని, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కొందరు ఇప్పుడు ఆఫీస్ లలో కూర్చుని ఈగలు తోలుకుంటున్నారని పరోక్షంగా కోటంరెడ్డిపై సెటైర్లు వేశారు అనిల్.
కోటంరెడ్డి ఎగ్జిట్ తో నెల్లూరు వైసీపీలో అనిల్ హవా పెరిగినట్టయింది. ఆయన వ్యతిరేక గ్రూపులు కూడా కాస్త సైలెంట్ అయ్యాయి. అయితే ఇప్పుడు మళ్లీ అనిల్ పై నిందలు మొదలయ్యాయి. అయితే వీటిని గట్టిగానే ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి. ఈ గొడవలు ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి.