ఏపీలో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇంత ఎండల్లోనూ చిన్న పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ బడుల్లోనే అవస్థలు పడుతున్నారు. అయినా ఒంటిపూట బడులపై ఏపీ పాఠశాల విద్యాశాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్న నేపథ్యంలో ఏపీలోనూ మార్చి 15 నుంచే ఒకపూట బడులు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు H3N2 వైరస్ హడలెత్తిస్తోంది. దీంతో అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూళ్లకు పంపొద్దని విద్యాశాఖ తల్లిదండ్రులను కోరింది.


గతేడాది తెలంగాణలో మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు నిర్వహించగా.. ఏపీలో మాత్రం ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూటబడులు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే.. ఆ సంవత్సరంలో పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ..ఈ ఏడాది అలాంటి సమస్య లేకున్నా.. గతేడాది మాదిరిగానే ఏప్రిల్ 4 నుంచి ఒంటి పూట బడులు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  లేదా మార్చి చివరి వారంలో పాఠశాలలకు ఒకపూట బడులు నిర్వహంచే అవకాశాలు కూడా లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒంటిపూట బడుల్లో తరగతులు ఉదయం 7.30 నిమిషాల నుంచి 11.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఏపీలో ఏప్రిల్ 30 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండే అవకాశం ఉంది. అంటే విద్యార్థులకు 43 రోజులపాటు వేసవిసెలువులు ఉంటాయి.


తెలంగాణలో ఇలా..
తెలంగాణ పాఠ‌శాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటి పూట బ‌డులు నిర్వహించాలని నిర్ణయించింది. పగలు ఎండ దంచి కొడుతుంది. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. స్కూల్స్‌లోని విద్యార్థులు వేడికి మరింత ఇబ్బంది పడుతున్నారు. ఇక ఒంటి పూట బడులకు సంబంధించి కూడా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా క్లారిటీ ఇచ్చింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మార్చి రెండో వారం నుంచి స్కూల్స్ సగం పూటే నడుస్తాయని  తెలిపింది. అంటే విద్యాశాఖ అధికారుల నుంచి వస్తున్న అనధికార సమాచారం ప్రకారం మార్చి 15వ తేదీ (బుధవారం) నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు ప్రారంభం అవ్వనున్నాయి. ఒక్క పూట బడులు సమయంలో ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు.
 
ఈ ఒంటి పూట బడి సమయంలో ప్రవేట్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ స్కూళ్లల్లో మెరుగైన మంచినీరు పిల్లలకు అందేలా చూడాలని విద్యాశాఖ సూచించింది. ఇక తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13 వరకు జరుగుతాయి. మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12వ తేదీ నుంచి ప్రారంభించాలని తాజాగా విద్యాశాఖ నిర్ణయించింది.  1-5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే అయినందున వారికి ఏప్రిల్ 17తో ముగుస్తున్నాయి.ఇక 6 నుంచి 9వ త‌ర‌గ‌తుల‌ వారికి ఏప్రిల్ 20 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఎగ్జామ్ రిజల్ట్స్ ఏప్రిల్ 21వ తేదీన‌ వెల్లడించి రికార్డుల్లో పొందుపరచాలని విద్యాశాఖ తెలిపింది.

తెలంగాణ ఈ  సారి వేస‌వి సెల‌వులు భారీగానే..
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవుల షెడ్యూల్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు ఈ ఏడాది వేసవి సెలవులు ఉంటాయని విద్యాశాఖ ఇటీవల వెల్లడించింది. తిరిగి పాఠశాలలు జూన్ 12న పాఠశాలలు పున: ప్రారంభం అవ్వనున్నాయి. మొత్తం 48 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి.