TSBJP Plan : తెలంగాణలో 90 స్థానాలపై గురి పెట్టిన బీజేపీ .. వాటిలో బలమైన అభ్యర్థులను నిలబెట్టడమే కాదు గెలిచి తీరాలన్న పట్టుదలతో వ్యూహాలను ఖరారు చేస్తోంది. తెలంగాణలో గెలుపును అమిత్ షా చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నేరుగా ఆయనే వ్యూహాలను ఖరారు చేస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణలో పాతుకుపోయిన బీఆర్ెస్‌ను దెబ్బకొడితేనే బీజేపీ బలం పుంజుకుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో ఓ వైపు బీఆర్ఎస్‌ను బలహీనం చేయడం.. మరో వైపు బీజేపీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. అధికారిక కార్యక్రమాలకు తరచూ తెలంగాణకు వస్తున్న అమిత్ షా .. పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్‌పై ముప్పేట దాడి !
కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు రావడం.. ఈడీ అరెస్ట్ చేస్తుందన్న ప్రచారంతో బీజేపీ నేతలు కూడా అప్రమత్తమయ్యారు. కవితను అరెస్ట్ చేస్తే అవినీతి ఆరోపణలతో మరింతగా విరుచుకుపడేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే సుప్రీంకోర్టు లో ఉన్న ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ సీబీఐ అధీనంలోకి వస్తే కేసీఆర్‌ను నేరుగా టార్గెట్ చేయవచ్చునని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తే పార్టీపై దృష్టి పెట్టలేరని.. బీజేపీ మిగతా పనిని పక్కాగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బీజేపీ నేతలకు తీరిక లేని కార్యక్రమాలు అప్పచెబుతున్న హైకమాండ్ !
మరో వైపు తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేందుకు పక్కా ప్లాన్‌తో, పకడ్భందీ వ్యూహంతో కార్యాచరణను అమలు చేస్తున్నారు బీజేపీ నేతలు. తెలంగాణ నేతల పనితీరుపై సమాచారం సేకరిస్తున్నారు. అధిష్టానం దూతలను రంగంలోకి దింపి సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూలన చూసినా బీజేపీ పేరు వినిపించేలా కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఈ ప్రక్రియ జరుగుతున్నట్లు పార్టీ జాతీయ కార్యవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్లు చెబుతున్నారు. అధినాయకత్వం ఆదేశాలతో పార్టీ కార్యక్రమాల్లో రాష్ట్ర నాయకత్వం స్పీడ్ పెంచింది. కవిత ఢిల్లీలో ధర్నాకు పోటీగా తెలంగాణ బీజేపీ మహిళా నేతలు కూడా హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ధర్నా చేశారు.
యూపీ ప్రణాళిక అమలులో ప్రత్యేక శ్రద్ధ
ఉత్తర భారతంలో ఇలాంటి ప్లాన్లనే అమలు చేసి సక్సెస్ అయిన బీజేపీ.. దక్షిణాదిన కూడా అదే ఫార్ములా ఉపయోగించి తెలంగాణాలో అధికార పగ్గాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రజా గోస, బీజేపీ భరోసా కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రజల ముందుకు వెళ్తోంది. ఇప్పటికే పది రోజులుగా 5వేల సమావేశాలు ఏర్పాటు- చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మొత్తంగా ఇదే కార్యక్రమంలో బిజీబిజీగా ఉన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ జాతీయ అగ్రనేతలు 15 రోజుల్లో 11వేల సమావేశాలు నిర్వహించాలని టార్గెట్ విధించి పనిచేయించారు. తర్వాత నియోజకవర్గ స్థాయి సమావేశాలు.. తర్వత జిల్లా..రాష్ట్ర స్థాయి బహిరంగసభలను నిర్వహించి.. బీజేపీని ప్రజల నోళ్లలో నానేలా చేయడంలో లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఓ వైపు బీఆర్ఎస్ కేసుల ఒత్తిడిలో ఉంటే.. బీజేపీ నేతలు మాత్రం యథేచ్చగా పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసే రాజకీయ వాతావరణం ఏర్పడుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని హైకమాండ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తోంది.