నెల్లూరు జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత అలజడి సృష్టించిందో అందరికీ తెలుసు. ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మారబోతున్నారని, ఆయన స్థానంలో కొత్త ఇన్ చార్చ్‌ని కూడా ప్రకటించబోతున్నారనే వార్తలొచ్చాయి. అయితే అసలీ వ్యవహారమంతా వట్టి అభూతకల్పనేనని తేల్చేశారు జిల్లా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. ప్రభుత్వంపై వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చే క్రమంలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన నెల్లూరు రూరల్ వ్యవహారంపై కూడా స్పందించారు.
పార్టీలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, వాటిని అధిష్ఠానం పరిష్కరిస్తుందని చెప్పారు కాకాణి గోవర్దన్ రెడ్డి. నెల్లూరు జిల్లా వైసీపీలో ఉన్న సమస్యలు టీ కప్పులో తుఫాను లాంటివి అని చెప్పారు. ప్రభుత్వం ఎవరి ఫోన్‌లు ట్యాపింగ్ చేయదని అవగాహన లోపం తప్ప అలాంటి మాటలు నిజం కాదన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మారతారని ఎక్కడా చెప్పలేదని ఈ వదంతులన్నీ మీడియా సృష్టి అని కొట్టి పారేశారు.
అంతా వట్టిదే..
అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రమంతా రచ్చగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు. తన ఫోన్లు 3 నెలలుగా ట్యాప్ చేస్తున్నారని, వాట్సప్, టెలిగ్రామ్ కాల్స్ కూడా ట్యాపింగ్ జరుగుతోందని ఆరోపించారు. తనపై నిఘా కోసం ఐపీఎస్ ఆఫీసర్ ని నియమించుకోండి, పోయి మీ బాస్ కి చెప్పుకోండి అంటూ ఇంటెలిజెన్స్ సిబ్బందిని గద్దించారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. దీంతో ఇంటెలిజెన్స్ సిబ్బంది ఉన్నతాధికారులకు చెప్పడం, ఆ వ్యవహారం పార్టీ హైకమాండ్ కి చేరడం చకచకా జరిగిపోయాయి. ఈలోగా మీడియాలో కూడా శ్రీధర్ రెడ్డి వ్యవహారం హైలెట్ కావడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత పెద్దదైంది.
సోమవారం సాయంత్రం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర మరింత హడావిడి జరిగింది. స్థానిక నేతలు, తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. భవష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. అయితే మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కార్యకర్తలతో మాత్రం తన ఆవేదన చెప్పుకున్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. పార్టీ మార్పుపై సూచాయగా హింట్ ఇచ్చారు. ఈలోగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి పేరుని అధిష్టానం పరిశీలిస్తోందనే వార్తలు కూడా వచ్చాయి. దీనిపై కూడా శ్రీధర్ రెడ్డి స్పందించారు. తన తమ్ముడిని తనకి పోటీగా తెస్తున్నారని, తమ్ముడు వైసీపీ తరపున నిలబడితే తాను పోటీ నుంచి తప్పుకుంటానన్నారు.
ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ అంతా కల్పితమేనంటూ కాకాణి గోవర్దన్ రెడ్డి చెప్పడం విశేషం. గిరిధర్ రెడ్డితో పార్టీ అధిష్టానం మాట్లాడిందని స్థానికంగా గట్టిగా వినిపిస్తున్నా కాకాణి మాత్రం ఆ విషయాన్ని కొట్టిపారేశారు. పార్టీ అలాంటి చర్చలు జరపలేదన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డిని ఇన్ చార్జ్ గా ప్రకటించబోతున్నారనే వార్తలు అవాస్తవం అని చెప్పారు కాకాణి. పార్టీలో కష్టపడి పనిచేసిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి అని కితాబిచ్చారు. ఆయన పార్టీ మారతాడనే వార్తలన్నీ మీడియా సృష్టేనన్నారు.