పవన్ కల్యాణ్ ఈనెల 20న కడప జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రను ప్రారంభించబోతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో కౌలు రైతుల కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం చేయబోతున్నారు. ఈమేరకు ఆయన పర్యటన ఖరారైంది. అయితే ఈ పర్యటనకు కౌంటర్ గా ఇప్పటినుంచే వైసీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. కౌలు రైతు భరోసా యాత్రల పేరుతో పవన్ కల్యాణ్ వ్యవసాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. పవన్ తోపాటు, లోకేష్ కి కూడా వ్యవసాయంపై పరిజ్ఞానం లేదని అన్నారాయన. నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాణి.. పవన్, లోకేష్ పై సెటైర్లు పేల్చారు. 


రాష్ట్రంలో పండే 10 పంటల్ని పవన్ కల్యాణ్, లోకేష్ కి చూపిస్తామని.. ఆ పది పంటల్లో కనీసం ఐదింటిని గుర్తు పట్టడం వారికి సాధ్యం కాదని ఎద్దేవా చేశారు మంత్రి కాకాణి. గతంలో కూడా తాను ఈ సవాల్ విసిరానని.. మరోసారి అదే మాట చెబుతున్నానని అన్నారు. పవన్ కల్యాణ్, లోకేష్ ముందు పంటల గురించి అవగాహన పెంచుకోవాలని, ఆ తర్వాతే వ్యసాయం గురించి మాట్లాడాలన్నారు. 


ముందు వ్యవసాయం గురించి పవన్, లోకేష్ తెలుసుకోవాలన్నారు మంత్రి కాకాణి. వ్యవసాయం గురించి మాట్లాడటాన్ని తానుతప్పుబట్టడం లేదని, కానీ విషయావగాహన లేకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. కనీసం 10 పంటలను చూపిస్తే, అందులో ఐదింటిని పవన్, లోకేష్ గుర్తుపట్టలేని ఎద్దేవా చేశారు కాకాణి. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్మించిన నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు మంత్రి కాకాణి. నెల్లూరులోని అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నుండి ఈ కార్యక్రమం నిర్వహించారు. 


రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ ఆధునిక సాంకేతికపద్దతులు, పరిశోధనలు రైతులకు అందుబాటులోకి తెస్తోందని అన్నారు మంత్రి కాకాణి. రాష్ట్రంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని వివిధ వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో 36 కోట్ల రూపాయలతో నిర్మించిన 13 నూతన భవనాలను మంత్రి ప్రారంభించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో 31వ స్థానంలో వున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం నేడు 11వ స్థానానికి చేరుకుందని, దీనికి సీఎం జగన్ కృషి ఎంతో ఉందని చెప్పారు. పరిశోధన, బోధన పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించేలా రైతులకు అవసరమైన సాంకేతికతను, వంగడాలను అందిస్తున్నామని చెప్పారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. 


రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబానికి వ్యవసాయ రంగానికి విడదీయలేని అనుబంధం ఉందని అన్నారు కాకాణి గోవర్దన్ రెడ్డి. వైఎస్ఆర్ హయాంలో తీసుకొచ్చిన జలయజ్ఞం, నేడు నెల్లూరు జిల్లాలో మంచి ఫలితాలను ఇవ్వబోతోందని అన్నారాయన. రాజు మంచి వాడైతే ప్రకృతి సహకరిస్తుంది అన్న పెద్దల మాటకు నిలువెత్తు నిదర్శనం జగన్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా సాగునీటి కొరత లేకుండా ప్రభుత్వం రైతులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోందని, ప్రకృతి సహకరించి సకాలంలో వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు కాకాణి. రైతులకు గిట్టు బాటు ధర కల్పించేందుకు 400 కోట్ల రూపాయలనుంచి 500 కోట్ల భారాన్ని  సైతం ప్రభుత్వం భరిస్తోందన్నారు.