ఏపీలో లక్షా యాభైవేల పెన్షన్లు రద్దయ్యాయి. ఇప్పటికే లబ్ధిదారులకు నోటీసులు వెళ్లాయి. వీరందరికీ జనవరి 1న పెన్షన్ అందుతుంది, జనవరి 15లోగా సరైన కారణాలు చూపిస్తూ సర్టిఫికెట్లు సమర్పించకపోతే ఫిబ్రవరి 1నుంచి పెన్షన్ అగిపోతుంది. సడన్ గా ఇలా పెన్షన్ ఆగిపోతుందని చెప్పే సరికి లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అధికారులను చుట్టుముడుతున్నారు.


ఒక్క నెల్లూరు నగరంలోనే 6వేల పెన్షన్లు రద్దయ్యాయి. నెల్లూరు రూరల్ పరిధిలో 3వేలు, అర్బన్ పరిధిలో మరో 3వేల పెన్షన్లు రద్దయ్యాయి. వీరంతా ఇప్పుడు తమ సంగతేంటో చెప్పాలంటూ స్థానిక నేతల్ని నిలదీస్తున్నారు. ఈరోజు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి పెన్షన్ బాధితులంతా పోటెత్తారు. తమ పెన్షన్ ఎందుకు రద్దు చేశారో చెప్పాలంటూ నిలదీశారు.


వాస్తవానికి పెన్షన్ రద్దయిన తర్వాత వారందరికీ ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చాయి. ఇంటి విస్తీర్ణం ఎక్కువగా ఉందనో లేక, ఇంట్లో ఎవరైనా ఇన్ కమ్ ట్యాక్స్ పేయర్లు ఉన్నారనో, విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చాయనో.. కారణం చెబుతూ ఆ నోటీసులను పెన్షన్ దారులకు ఇచ్చారు వాలంటీర్లు. వారి వద్ద సంతకాలు పెట్టించుకుని వెళ్లారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల అకారణంగా పెన్షన్లు తొలగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిడ్డలకు దూరంగా ఉంటున్న తల్లిదండ్రులకు పెన్షన్లు ఆపేస్తే వారి ఆలనా పాలనా ఎవరు చూడాలనేదే అసలు ప్రశ్న. కుటుంబానికి దూరంగా ఉన్న వ్యక్తి ఇన్ కమ్ ట్యాక్స్ కడితే, ఆ కుటుంబంలో ఒకరికి పెన్షన్ ఆపేయడం ఎంతవరకు సబబు అనే విమర్శలు వినపడుతున్నాయి. తల్లిదండ్రుల్ని పట్టించుకోని బిడ్డల విషయంలో ఇలా పెన్షన్ ఆపేస్తే ప్రభుత్వం కూడా తప్పు చేసినట్టే కదా అని నిలదీస్తున్నారు.


సోమవారం నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన స్పందన కార్యక్రమానికి భారీగా బాధితులు తరలి వచ్చారు. కమిషనర్ ని చుట్టుముట్టారు. మరోవైపు వైసీపీ నాయకులు కూడా పెన్షన్ల రద్దుతో హడలిపోతున్నారు. పెన్షన్లు రద్దయిన తర్వాత బాధితులంతా నాయకులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని చోట్ల గడప గడప కార్యక్రమంలో నాయకులను నిలదీస్తున్న పరిస్థితి. అందుకే పెన్షన్ల రద్దు తర్వాత వైసీపీ నేతలెవరూ గడప గడపను కొనసాగించడానికి ఇష్టపడటం లేదు. నెల్లూరు కార్పొరేషన్లో కార్పొరేటర్లు చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బాధితులు ఫోన్లు చేస్తున్నా వాటికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు కూడా తలలు పట్టుకుంటున్నారు. బాధితులకు హామీ ఇస్తున్నా వారికి తిరిగి న్యాయం చేయలేకపోతే తిప్పలు తప్పవని అనుకుంటున్నారు.


2023 జనవరి 1 నుంచి పెరిగిన్ పెన్షన్ ఇవ్వాల్సి ఉంది. అంటే 3 వేల రూపాయలకు పెన్షన్ పెంచుకుంటూ పోతానన్న జగన్ 2023 జనవరి-1నుంచి 2750 రూపాయలె పెన్షన్ ఇస్తానన్నారు. అలా పెన్షన్ ను పెంచుతున్నట్టే పెంచి, ఇటువైపు లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ పెంచాల్సిన అవసరం లేదని, పాత పెన్షన్ మాత్రమే ఇప్పిస్తే చాలని చివరకు బాధితులు వాపోతున్న పరిస్థితి.


రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. రాష్ట్రంలో మొత్తం లక్షా యాభైవేల పెన్షన్లు తొలగించారు. లబ్ధిదారులనుంచి ఒత్తిడి మరీ ఎక్కువైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారేమో చూడాలి.