లక్ష్మీపార్వతి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు, కానీ ఆమె ఆలోచన అంతా టీడీపీ చుట్టూనే తిరుగుతోంది. టీడీపీ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, దాన్ని తిరిగి ఎన్టీఆర్ అసలైన వారసులు చేపట్టాలని తిరిగి ఆ పార్టీ బాగుపడాలని ఆశిస్తున్నారు. అక్కడితో ఆగలేదు, చంద్రబాబు అర్జంట్ గా ఆ పని చేయాలని డిమాండ్ చేశారు. లోకేష్ ని హైలైట్ చేయాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని, టీడీపీని నందమూరి వారసుల చేతుల్లో పెట్టాలని అన్నారామె. హరికృష్ణ తనయులు ప్రయోజకులని, వారికి పార్టీ అప్పగించాలన్నారు. నందమూరి వారసులు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే వారికి ఓట్లు వేయాలని, అందులో తప్పేమీ లేదన్నారు లక్ష్మీపార్వతి. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆమె చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పవన్ కి సలహాలు..
పనిలో పనిగా పవన్ కల్యాణ్ కి కూడా సలహాలిచ్చారు లక్ష్మీపార్వతి. సినిమాల్లో రారాజుగా ఉన్న పవన్ కల్యాణ్, రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు బుట్టలో పడ్డారని అన్నారు లక్ష్మీపార్వతి. ఆయన అమాయకుడని, ఆయనంటే తనకెప్పుడూ సానుభూతి ఉంటుందని చెప్పారు. పవన్ కల్యామ్ ఇండిపెండెంట్ గా ఉంటే రాజకీయాల్లో రాణించగలరని, చంద్రబాబుకి ఊడిగం చేయడం సరికాదన్నారు. ఇంతా చేసి, చివరకు చంద్రబాబు కొడుపు పల్లకీ మోయాల్సి వస్తుందని, ఆ బానిస బతుకెందుకని ప్రశ్నించారు. విషవృక్షపు నీడనుంచి పవన్ బయటపడాలని సలహా ఇచ్చారు.
లోకేష్ పై తీవ్ర విమర్శలు..
పనికి మాలిన నారా లోకేష్ కోసం కోట్లు ఖర్చు పెట్టి భాష నేర్పించారని, అయినా ప్రయోజనం లేదని మండిపడ్డారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ మనవడిగా లోకేష్ ను ప్రజలు స్వీకరించడం లేదన్నారు. లోకేష్ అయోమయంలో మాట్లాడుతుంటారని, సబ్జెక్ట్ లేదు కాబట్టే ఇటీవల తిట్ల దండకం అందుకున్నారని మండిపడ్డారు. నందమూరి అభిమానులు చంద్రబాబు, లోకేష్‌లను రాజకీయాల నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాక ముందే చంపుతా, నరుకుతా, బట్టలు విప్పి కొడతా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఇలా చేస్తే ఎలా ఓట్లు పడతాయని ప్రశ్నించారు.
అమ్ముడుపోయే నాయకులు అన్ని పార్టీలో ఉంటారు.. అలాంటి చీడ పురుగులు వెళ్లిపోతేనే పార్టీ బలపడుతుందని చెప్పారు లక్ష్మీపార్వతి. రాజకీయంగా చంద్రబాబును నమ్మకున్న వారు భూస్థాపితం కావడం ఖాయమన్నారు. గతంలో 23 మంది ఎమ్మెల్యే లను చంద్రబాబు కొనుగోలు చేశారని, పార్టీ మారిన ఆ 23 మంది ఎమ్మెల్యే లు రాజకీయాల్లో దారుణమైన స్థితిలో ఉన్నారని గుర్తు చేశారు. టికెట్ రాదనే భయంతోనే తమ వాళ్ళు పార్టీ జంప్ చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు రాని ఇబ్బంది, ఆ ముగ్గురికి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు లక్ష్మీపార్వతి.
వైఎస్ జగన్ పాలన సుభిక్షంగా ఉందన్నారు లక్ష్మీపార్వతి. మేనిఫెస్టో లో చెప్పిన అన్ని హామీలను 99.5 శాతం ఆయన పూర్తి చేశారన్నారు. గత ప్రభుత్వాలు తమ పాలనలో 5 శాతం కూడా మేనిఫెస్టో హామీలను నెరవేర్చలేదన్నారు. నా రీజకీయ చరిత్రలో ప్రజలు ను ఇంత గొప్పగా చూసుకున్న ముఖ్యమంత్రులెవరూ లేరన్నారామె. 600 పైన హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చింది కేవలం వైసీపీ మాత్రమేనన్నారు. ఆంధ్ర ప్రదేశ్ IT రంగం పరుగులు పెడుతోందని, విద్య వైద్య రంగం లో వైసీపీ ప్రభుత్వం ఎంతో అద్భుతం గా పనిచేస్తోందని కితాబిచ్చారు.