నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో ఈరోజు అధికారికంగా చేరబోతున్నారు. ఆయన చేరిక సందర్భంగా నెల్లూరులో బలప్రదర్శన జరిగింది. నెల్లూరు రూరల్ లో 300 కార్లతో ర్యాలీగా బయలుదేరారు కోటంరెడ్డి. ఆయన వెంట రూరల్ కార్పొరేటర్లు, వారి అనుచరులు బలప్రదర్శనగా మంగళగిరి బయలుదేరి వెళ్లారు. వారం రోజులుగా చేరిక కార్యక్రమం కోసం ఏర్పాట్లు జరిగాయి. భారీ ఎత్తున ఈ బలప్రదర్శన చేపట్టారు.
కలిసొచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు..
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరికకు ఒకరోజు ముందే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారింది. కోటంరెడ్డి నెల్లూరు నుంచి పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేసి మంగళగిరి వెళ్తున్నారు. వైసీపీ పెట్టినప్పటి నుంచి కోటంరెడ్డి కుటుంబం జగన్ కు నమ్మకంగా ఉంటూ వచ్చింది. ఇటీవల కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడిన తర్వాత ఓ దశలో పార్టీ అధిష్టానం ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డిని రూరల్ ఇన్ చార్జ్ గా ప్రకటించాలని చూసింది. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. అన్నతోటే తన ప్రయాణం అని తేల్చి చెప్పారు గిరిధర్ రెడ్డి. దీంతో అధిష్టానం అక్కడ ఎంపీ ఆదాలను ఇన్ చార్జ్ గా ప్రకటించింది.
నెల్లూరు రూరల్ లో అన్న పేరుతో అన్ని వ్యవహారాలను గిరిధర్ రెడ్డి చక్కబెడతారు. రూరల్ లో మారుమూల గ్రామాల్లో కూడా కోటంరెడ్డికి మంచి పట్టు ఉంది. అన్న బిజీగా ఉన్నా కూడా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆయన తరపున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారు. పార్టీతో సంబంధం లేకుండా తమకంటూ ఓ వర్గం ఏర్పాటు చేసుకున్నారు కోటంరెడ్డి సోదరులు. దీంతో వారిద్దరు వైసీపీని వీడినా రూరల్ ప్రజలు వారి వెంటే ఉన్నారు.
తమ్ముడే ఎందుకు..?
వాస్తవానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టీడీపీ కండువా కప్పుకోవాల్సి ఉంది. కానీ పార్టీ ఫిరాయింపు పేరుతో వేటు వేస్తారనే భయం ఉంది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీ వైపు వచ్చే సమయంలో వారికి నేరుగా జగన్ పార్టీ కండువాలు కప్పలేదు. వారి కుటుంబ సభ్యులకే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేలు మాత్రం కండువాలు వేసుకోకపోయినా జగన్ కే జై కొట్టారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలను అలా వారు కవర్ చేసుకున్నారు. ఇప్పుడు కోటంరెడ్డి కూడా జగన్ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. తాను పార్టీ మారకుండా తన తమ్ముడిని టీడీపీలోకి పంపిస్తున్నారు.
జగన్ ఏం చేస్తారు..?
కోటంరెడ్డి కూడా టీడీపీలో చేరితే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశముంది. కానీ ఇప్పుడు వైసీపీ చేతులు కట్టేసినట్టయింది. శ్రీధర్ రెడ్డి పార్టీ మారడంలేదు. ఆయన తమ్ముడు పార్టీ మారినా జగన్ చేసేదేమీ లేదు. అందుకే వైసీపీ టీమ్ సైలెంట్ గా ఉంది. జగన్ ఫార్ములానే ఫాలో అవుతూ కోటంరెడ్డి సోదరులు టీడీపీవైపు వచ్చేశారు. తనపై వేటు పడకుండా సేఫ్ గేమ్ ఆడారు శ్రీధర్ రెడ్డి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం వెనక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓటు కూడా ఉందనేది బహిరంగ రహస్యం. అంతరాత్మ ప్రభోదానుసారం తాము ఓటు వేశామని చెప్పారు రెబల్ ఎమ్మెల్యేలు. టీడీపీ అభ్యర్థి గెలవడంతో ఇప్పుడు వారు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కోటంరెడ్డి ఆఫీస్ దగ్గర సంబరాలు జరిగాయి. ఈరోజు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అధికారికంగా టీడీపీలో చేరుతున్నారు. ఇకపై నెల్లూరు రూరల్ లో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా పోరాటం బలంగా జరిగే అవకాశముంది.
ఇప్పటికే నెల్లూరు రూరల్ లో ఉన్న టీడీపీ నాయకుల్ని అధిష్టానం బుజ్జగించింది. వారికి నచ్చజెప్పి కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డిని ముందుగా పార్టీలో చేర్చుకుంటున్నారు చంద్రబాబు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో శ్రీధర్ రెడ్డికి రెడ్ కార్పెట్ పరిచే కార్యక్రమం ఉంటుంది.