చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రవ్యాప్తంగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులు నిరసనలు, ఆందోళనలకు దిగే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని డిపోలనుంచి ఆర్టీసీ బస్సులు కూడా బయటకు రావడంలేదు. ఇక నెల్లూరు జిల్లాలో కూడా పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరినీ ఇల్లు దాటి బయటకు రానీయడంలేదు.
కూడళ్లలో నిఘా..
టీడీపీ నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే అవకాశం ఉండటంతో పోలీసులు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ పోలీసు బృందాలు కూడళ్లలోకి వచ్చాయి. ప్రజలను గుంపులు గుంపులుగా చేరకుండా అడ్డుకుంటున్నారు. అనుమానాస్పద వ్యక్తుల్ని వెంటనే అక్కడినుంచి తరలిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆందోళనలు జరుగుతాయని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని కూడా ఇంటినుంచి బయటకు రానీయడంలేదు. జిల్లాలోని ఇతర నేతల ఇళ్లకు కూడా పోలీసులు వెళ్లారు. ఆందోళన కార్యక్రమాలు చేపడతారన్న సమాచారం మేరకు వారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయగిరి సర్కిల్ పరిధిలో 35 మంది టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు, నియోజకవర్గం లోని అన్ని బస్టాండ్ సెంటర్లలో పికెట్ నిర్వహిస్తున్నారు.
నెల్లూరు నగరంలో చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ ని ఖండించారు. అరెస్ట్ లతో జగన్ నిరంకుశత్వం మరోసారి బయటపడిందని అంటున్నారు నేతలు.
ఉద్వేగ వాతావరణం...
చంద్రబాబు అరెస్ట్ ని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. రెండు రోజుల ముందే చంద్రబాబు తన అరెస్ట్ పై అనుమానం వ్యక్తం చేశారని, అంతలోనే ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని అంటున్నారు టీడీపీ నేతలు. సీఎం జగన్ లండన్ లో ఉండగానే, ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ చంద్రబాబుని అరెస్ట్ చేశారని, ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని సవాళ్లు విసురుతున్నారు. అటు నారా లోకేష్ యువగళం క్యాంప్ సైట్ వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన తండ్రిని పరామర్శించేందుకు విజయవాడకు బయలుదేరిన లోకేష్ ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన నేలపైనే కూర్చుని నిరసనకు దిగారు. ఆయన్ను పోలీసులు కదలనివ్వడం లేదు. దీంతో కోనసీమజిల్లా పొదలాడ క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
చంద్రబాబుని అరెస్ట్ చేయడం, నారా లోకేష్ యువగళం యాత్ర వద్ద పోలీసులు భారీగా మోహరించడంపై నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఓ వ్యూహం ప్రకారం చంద్రబాబు, లోకేష్ యాత్రలను నిలువరించేందుకే పోలీసులు పాత కేసుని తెరపైకి తెచ్చారని అంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ కి కచ్చితంగా రాష్ట్ర ప్రజలు బదులు తీర్చుకుంటారని హెచ్చరిస్తున్నారు నేతలు. అటు సోషల్ మీడియాలో కూడా చంద్రబాబుకి మద్దతుగా చాలామంది తమ సందేశాలను ఉంచుతున్నారు. నారా రోహిత్ సహా.. పలువురు చంద్రబాబుకి మద్దతుగా ట్వీట్లు వేశారు.