గుప్త నిధులకోసం వెళ్లిన ఓ వ్యక్తి కరెంట్ షాక్ తో మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసి పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అతనితోపాటు అడవిలోకి వెళ్లినవారిని గట్టిగా ప్రశ్నించారు. దీంతో వారు నిజం ఒప్పుకున్నారు. తమతోపాటు గుప్త నిధుల వేటకు అడవిలోకి వచ్చిన లోకసాని కృష్ణయ్య కరెంట్ షాక్ తో చనిపోయాడని చెప్పారు.
అసలేం జరిగింది..?
ఉదయగిరి మండలం గంగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన లోకసాని కృష్ణయ్య, అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు, ప్రకాశం, కడప జిల్లాలకు చెందిన మరికొందరు, చెన్నైకి చెందిన ఓ పూజారి ముఠాగా ఏర్పడ్డారు. వారంతా తరచూ గుప్తనిధులకోసం వెదికేవారు. ఏవేవో పూజలు చేసేవారు, ఎక్కడెక్కడో గాలింపు చేపట్టేవారు. ఉదయగిరి అడవుల్లో గుప్తనిధులు ఉంటాయన్న సమాచారంతో కొంతకాలంగా వారు అక్కడ రెక్కీ నిర్వహించారు. గుప్త నిధుల జాడ చెప్పే అధునాతన పరికరాలు కూడా కొనుగోలు చేశారు. వాటిని తీసుకుని ఈనెల 24 ఉదయాన్నే ఆ ముఠాతో కలసి లోకసాని కృష్ణయ్య ఇంటినుంచి బయటకు వెళ్లాడు. రాత్రికి ఇంటికి రాలేదు, ఫోన్ స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. రెండురోజులు గడిచినా జాడలేకపోవడంతో ఈనెల 28న అతని భార్య దత్తాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త ఇంటినుంచి వెళ్లిపోయి కనిపించడంలేదని, ఆరోజు భర్తని తీసుకెళ్లినవారి గురించి సమాచారమిచ్చారు దత్తాద్రి. పోలీసులు వారిని పిలిపించి తమదైన రీతిలో ప్రశ్నించడంతో అసలు గుట్టు విప్పారు.
ఆరోజు ఏం జరిగిందంటే..
గుప్త నిధుల వేటకోసం ఆ ముఠా ఈనెల 24న ఉదయగిరి అడవుల్లోకి వెళ్లింది. అడవుల్లో దారి తెలిసిన కృష్ణయ్య దారి చూపుతూ ముందుగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఓ మామిటితోడటు అడ్డుగా కంచె వేసి ఉంది. ఆ కంచెకు విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశారు. అతి తెలియని కృష్ణయ్య కంచె వద్దకు వెళ్లి ఒక్కసారిగా షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. దీంతో ఆ ముఠా సభ్యులకు భయం వేసింది. ఈ ఘటన గురించి బయటకు చెబితే.. అసలు అడవిలోకి ఎందుకెళ్లారనే ప్రశ్న వస్తుందని, గుప్త నిధులకోసం వెళ్లారంటే పోలీసులు అరెస్ట్ చేస్తారని వారంతా భయపడ్డారు. ముందుకు వెళ్లకుండా ఎక్కడివారక్కడ జారుకున్నారు. నిదానంగా ఈ వ్యవహారం బయటపడిన తర్వాత ఊరిలోకి రావొచ్చనుకున్నారు. రెండ్రోజుల తర్వాత కృష్ణయ్య ఊరువారిద్దరూ అక్కడికి వచ్చారు. అప్పటికే కృష్ణయ్య భార్త పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో స్థానిక పోలీసులు ఆ ఇద్దరిపై నిఘా పెట్టి పట్టుకున్నారు. అందులో ఒకరిని గట్టిగా ప్రశ్నించారు. వారిచ్చిన సమాచారం మేరకు కృష్ణయ్య చనిపోయినట్టు నిర్థారించుకున్నారు.
కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం ఆలస్యం కావడంతో ఈ ఘటన కూడా ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. కృష్ణయ్య చనిపోయిన 5 రోజుల తర్వాత శవం దొరికింది. ఆ ముఠా సభ్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు మామిడి తోట వద్దకు వెళ్లి కృష్ణయ్య శవాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్ మార్టమ్ కి తరలించారు. ముఠాలోని మిగతా సభ్యులకోసం గాలిస్తున్నారు.