కింగ్ ఫిషర్ బీర్, నాకవుట్ బీర్, హేవర్డ్స్ 5 థౌజండ్.. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో మందుబాబులకు ఈ పేర్లు వినిపించడంలేదు. బూమ్ బూమ్ బీర్లు, ప్రెసిడెంట్ మెడల్.. లాంటి వెరైటీ బ్రాండ్లు పరిచయం అయ్యాయి. అయితే కోరిక చంపుకోలేక పాత వాసన మరచిపోలేక అలాంటి బీర్లు, మందు కోసం చాలామంది అర్రులు చాస్తుంటారు. వారికోసమే నెల్లూరులో అక్రమార్కులు ప్రత్యేకంగా మందు డోర్ డెలివరీ మొదలు పెట్టారు.   పాండిచ్చేరినుంచి సరుకు తెస్తాడు, ఎవరికీ అనుమానం రాకుండా నెల్లూరులో ఓ గోడౌన్ నిర్వహిస్తున్నారు . తనకి తెలిసిన వారికి, పరిచయస్తులకు మాత్రమే వాటిని డోర్ డెలివరీ చేస్తారు . ఆషామాషీ కాదు, అన్నీ కాస్ట్ లీ బ్రాండ్సే, ఏపీలో దొరకని బ్రాండ్ లే. ఇలా వాటిని ప్రత్యేకంగా తెప్పించి మరీ క్యాష్ చేసుకుంటున్నారు నెల్లూరుకి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి. 


తెర ముందు ప్రవీణ్ కనిపిస్తున్నా ఒక్కడు చేయలేడు.. తెర వెనుక ఖచ్చితంగా పవర్ ఫుల్ వ్యక్తులు ఉంటారు. తాజాగా ఈ అక్రమ మద్యం డంప్ ని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. 964 లిక్కర్ బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు.   నెల్లూరులో ఇటీవలే అతిపెద్ద లిక్కర్ స్కామ్ ని ఛేదించారు పోలీసులు. గోవా బ్రాండ్లకు ఏపీ లేబుళ్లు వేసి అమ్ముతున్న ఓ ముఠాను పట్టుకున్నారు. మొత్తం 8మందిని ఇప్పటి వరకూ అరెస్ట్ చేయగా మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. వీరి వద్దనుంచి 18వేల మద్యం బాటిళ్లను సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవానుంచి నెల్లూరు జిల్లా మైపాడుకి తారు ట్యాంకర్ల ద్వారా మద్యాన్ని తరలించి వాటిని ఓ చోట దాచి ఉంచి, మెల్లగా వాటికి లేబుళ్లు మార్పించి మద్యం దుకాణాల్లో అమ్మేవారు.


అయితే మద్యం దుకాణాల్లో లెక్క అంతా పక్కాగా ఉండేది. దీంతో సూపర్ వైజర్లను మచ్చిక చేసుకున్నారు. అందరికీ మామూళ్లు ఇచ్చి లైసెన్స్ డ్ మద్యం దుకాణాల్లోనే గోవా మందుని అమ్మవారు. 25 రూపాయల బాటిల్ పై 75 రూపాయల లాభం కళ్లజూసేవారు. ఇక గోవాతోపాటు పాండిచ్చేరి మందు కూడా నెల్లూరుకి ఈజీగా రవాణా కావడం విశేషం. గోవా మందుపై పోలీసులు దృష్టిపెట్టగా తాజాగా పాండిచ్చేరి వైన్ డంప్ ని సెబ్ పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తి ఓ ప్రైవేట్ వెహికల్ డ్రైవర్ అని, తరచూ పాండిచ్చేరి వెళ్లి అక్కడినుంచి మద్యాన్ని అక్రమంగా తెచ్చేవాడని అంటున్నారు. ప్రవీణ్ వెనుక ఉన్న వ్యక్తుల కోసం ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. 


డోర్ డెలివరీ ప్రత్యేకత.. 
గతంలో ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉండటంతో ఇలా మద్యం అక్రమంగా తెచ్చి అమ్ముకునేవారు. ఇటీవల రేట్లు కాస్త సవరించినా ఫలితం లేదు. బ్రాండ్లు దొరక్కపోవడంతో చాలామంది పక్క రాష్ట్రాలవైపు చూస్తున్నారు. గోవా, పాండిచ్చేరి బ్రాండ్లకు నెల్లూరులో డిమాండ్ పెరిగింది. పోలీసులు అప్పుడప్పుడు ఇలా దాడులు చేసి వ్యవహారం బట్టబయలు చేస్తున్నా.. కేటుగాళ్లు కొత్త మార్గాలను ఎంపిక చేసుకుంటున్నారు.