ఆయన ఓ ఏఆర్ ఎస్సై. నెల్లూరు జిల్లాలో విధి నిర్వహణలో ఉన్నాడు. పేరు వాసు. భార్యతో విడాకుల కేసు కోర్టులో ఉండగా మరో వివాహం చేసుకుని నెల్లూరు పోస్టల్ కాలనీలో కాపురం పెట్టాడు. మొదటి భార్య వచ్చి ఇప్పుడు గొడవ చేసింది. విడాకులు తేలకుండానే మరో మహిళని పెళ్లి చేసుకున్నాడని, ఇదెక్కడి న్యాయమంటూ నిలదీసింది. తన భర్త తనకు కావాల్సిందేనంటూ రోడ్డుపై బైఠాయించింది. ఆయన మాత్రం అలాంటిదేమీ లేదంటున్నాడు. తాను మరో మహిళను వివాహం చేసుకోలేదని, కేవలం తన ఇంట్లో ఆమె పనిచేస్తోందని చెప్పుకొచ్చాడు. అయితే మొదటి భార్య రెండో భార్య ఇంటికి రావడం, భర్తను అక్కడే చితగ్గొట్టడంతో ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపింది. 


నెల్లూరుకు చెందిన ఏఆర్ ఎస్సై వాసుని ఆయన భార్య చితగ్గొట్టింది. భర్త మరో మహిళ ఇంట్లో ఉండగా ఆమె సడన్ గా ఆ ఇంటికి వచ్చి రచ్చ చేసింది. తనకు తన భర్త కావాలని గొడవ చేసింది. గుంటూరుకు చెందిన వాసు, సామ్రాజ్యంకు 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక అబ్బాయి, అమ్మాయి. కొన్నాళ్లుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఉద్యోగ రీత్యా నెల్లూరులో ఉంటున్న భర్త ఏఆర్ ఎస్సై వాసు.. పోస్టల్ కాలనీలో ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య ఆరోపిస్తోంది. ఈరోజు నేరుగా నెల్లూరు వచ్చి పోస్టల్ కాలనీలో భర్త ఉంటున్న ఇంటికి వెళ్లి ఆయన్ను పట్టుకుని కొట్టింది. మరో మహిళ కూడా అక్కడ ఉండటంతో.. ఎస్సైకి ఏం చెప్పాలో తెలియలేదు. ఈ వ్యవహారం బయటపడటంతో పోలీసులు విచారణ చేపట్టారు. తన భార్యతో విడాకుల కేసు కోర్టులో ఉందని, తనని ఇప్పుడిలా వేధిస్తోందని చెబుతున్నారు ఎస్సై వాసు. 


మొదటి భార్య సామ్రాజ్యంతో వాసుకి గొడవలున్నాయి. దీంతో ఇద్దరూ విడాకులకోసం కోర్టులో కేసు వేశారు. భార్య సామ్రాజ్యంకు విడాకులు ఇష్టం లేకపోవడంతో ఆ కేసు తేలడంలేదు. ఈలోగా వాసు, మౌనిక అనే మరో మహిళతో కలసి ఉంటున్నాడు. అనారోగ్యం రీత్యా తనకోసం ఓ మనిషి ఉండాలని, అందుకే ఆమెతో కలసి ఉంటున్నానని చెబుతున్నాడు వాసు. ఆమెను తాను వివాహం చేసుకోలేదంటున్నాడు. తన మొదటి భార్య కొడుకుని కూడా తన దగ్గరే ఉంచుకున్నాడు. 


మొదటి భార్య సామ్రాజ్యం మాత్రం ఇప్పుడు గొడవ చేస్తోంది. తనతో విడాకుల వ్యవహారం తేలకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తోంది. రెండో భార్యకోసం తనని, తన బిడ్డని కూడా వదిలేసి వచ్చాడంటోంది. తన కుమార్తె ఆస్పత్రిలో ఉన్నా కూడా పట్టించుకోలేదంటోంది సామ్రాజ్యం. తన కొడుకు మాత్రం భర్తతోనే ఉంటాడని చెబుతోంది.  


గుంటూరునుంచి భర్తకోసం నెల్లూరు వచ్చిన సామ్రాజ్యం, మౌనిక ఇంటి ముందు గొడవ చేసింది. తన కుమార్తె, బంధువులతో కలసి ఆ ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. విడాకుల కేసు కోర్టులో ఉన్న విషయం కరెక్టే అయినా, విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి చేసుకున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలంటోంది సామ్రాజ్యం.