నెల్లూరులో ఇటీవల సామాజిక పింఛన్ల సొమ్ముని కొంతమంది దొంగలు ఎత్తుకెళ్లారు. అల్లూరుకి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని వెళ్తుండగా వెనకనుంచి మాటు వేసిన దొంగలు బైక్ పై ఉన్న క్యాష్ బ్యాగ్ ని తీసుకెళ్లారు. ఆ తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ వారిని వెంబడించినా ఫలితం లేదు, వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయినా సరే దొంగల ఆచూకీ దొరకలేదు. తాజాగా వారిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు కేసు వివరాలు తెలియజేశారు. ఈ కేసు ఛేదనలో చొరవ చూపించిన పోలీసులకు ఆయన క్యాష్ రివార్డ్ లు అందించారు. వారిని అభినందించారు. 


అసలేం జరిగింది... ?
ఈ నెల సామాజిక పింఛ్ల పంపిణీ కోసం అల్లూరుకి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ బ్యాంక్ లో సొమ్ము డ్రా చేసుకుని వెళ్తున్నాడు. బైక్ పై ముందు బ్యాగ్ లో క్యాష్ పెట్టుకుని వెళ్తున్నాడు. వెనకనుంచి స్పీడ్ గా ఓ బైక్ లో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ బైక్ లో వెనక కూర్చున్న వ్యక్తి క్యాష్ బ్యాగ్ ని ఒడిసి పట్టుకున్నాడు. వెంటనే బైక్ స్పీడ్ పెంచి అక్కడినుంచి జారుకున్నారు. 


మాజీ వాలంటీర్..
ఈ దొంగతనంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి పేరు నరేంద్ర. ఇతను మాజీ వాలంటీర్. ఆ తర్వాత వైన్ షాపులో పనికి కుదిరాడు. సామాజిక పింఛన్ సొమ్ముని బ్యాంక్ నుంచి ఎవరు తీసుకొస్తారు, ఏరోజు తీసుకొస్తారు, ఎలా పంపిణీ చేస్తారనే విషయాలన్నీ అతనికి తెలుసు. ఆ నాలెడ్జ్ తోనే ఓ టీమ్ ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా క్రైమ్ సినిమాలు చూసి దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకున్నారు. గతంలో బిట్రగుంట వద్ద ఓ దొంగతనం చేశారు. 2 లక్షల 33వేల రూపాయలు కాజేశారు. అప్పుడు పోలీసులకి చిక్కలేదు. దీంతో ఈసారి ఏకంగా పింఛన్ సొమ్ముపై కన్నేనశారు. మాజీ వాలంటీర్ నరేంద్ర ఈ టీమ్ కి లీడర్ గా వ్యవహరించాడు. మొద్దం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం నిందితుల వద్ద 13 లక్షల 56వేల రూపాయల నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


సామాజిక పింఛన్ సొమ్ముని దోచుకెళ్లారనే సమాచారంతో పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసి గాలించారు. ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితులు గతంలో ఒంగోలులో బైక్ లు దొంగతనం చేశారని, అలా దొంగతనం చేసిన బైక్ ల సాయంతోనే ఇప్పుడీ దొంగతనాలు కూడా చేశారని మీడియాకు తెలిపారు జిల్లా ఎస్పీ విజయరావు.