నెల్లూరులో ఈరోజు ఓ శిలా ఫలకం ఆవిష్కరణ జరిగింది. విచిత్రం ఏంటంటే.. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అని ఉంది. ఈ శిలా ఫలకాన్ని జనసేన నేతలు వేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పవన్ కల్యాణ్ చేతుల మీదుగా పనులు జరుగుతాయని అందులో ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ ఫొటో కూడా అందులో ఉంది. 

ఎందుకీ శిలా ఫలకం..నెల్లూరు నగరంలోని మినీబైపాస్ రోడ్ ఆనుకుని ఉన్న సర్వేపల్లి కాల్వ పనులు సరిగా జరగడంలేదని ఆరోపించారు జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి. ఫ్లైఓవర్ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని చెప్పారు. వీటిని పూర్తి చేయడం వైసీపీ వల్ల కాదని, జనసేన అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తామని అన్నారు. అయితే అక్కడితో వారు ఆగలేదు.. జనసేన అధికారంలోకి వచ్చాక పనులు పూర్తి చేస్తామంటూ ఓ శిలాఫలకం రెడీ చేశారు. అందులో ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అంటూ ఆయన ఫొటో కూడా వేశారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని ముగించుకుని జనసేన నేతలు తిరిగి వెళ్లిపోయే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి పై రాళ్లతో దాడి చేశారు. ఆయన తలకు గాయాలయ్యాయి. దాడికి కారణమైన వ్యక్తిగా అనుమానిస్తున్న ఒకరిని జనసేన నేతలు కొట్టారు. అతడికి కూడా రక్తగాయాలయ్యాయి. పోలీసులు బాధితులను, వారిపై దాడి చేసిన వారిని స్టేషన్ కి తరలించారు. పవన్ కల్యాణ్ సీఎం అంటూ శిలా ఫలకం వేసిన వ్యవహారం నెల్లూరులో రచ్చ రచ్చగా మారింది. 

కామెడీ చేసినట్టేనా..?ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ సభలో సీఎం సీఎం అంటూ నినాదాలు చేసేవారు జనసైనికులు. వారి హడావిడిని కొన్నిసార్లు పవన్ కల్యాణ్ కూడా విసుక్కున్న ఉదాహరణలున్నాయి. సీఎం సీఎం అంటారు, అక్కడ ఓట్లు మాత్రం ఎవరూ వేయరు అనేవారు పవన్. సోషల్ మీడియాలో కూడా సీఎం పవన్ అనే హడావిడి చూస్తూనే ఉన్నాం. అయితే నెల్లూరు నాయకులు ఓ అడుగు ముందుకేసి ఏకంగా శిలా ఫలకాలు వేయించడం చర్చనీయాంశమైంది. 2024 తర్వాత కాబోయే సీఎం అని వేసినా కూడా.. ఇది కామెడీ వ్యవహారంగా మారింది. 

ఉన్నది ముగ్గురు.. అందులో గ్రూపులు.. నెల్లూరు జనసేనలో జిల్లా స్థాయి నాయకులు ఉన్నదే ముగ్గురు. అందులోనే మూడు గ్రూపులున్నాయిు. ఆ గ్రూపుల్లో ఒకరంటే ఇంకొకరికి పడదు. ఒకరిపై ఒకరు పైచేయికోసం పనిచేస్తుంటారు. ఇందులో ఓ గ్రూపు నాయకుడు ఇలా శిలా ఫలకం వేశారు. దీనిపై మిగతా వారికి సమాచారం లేదు, వారు ఈ కార్యక్రమానికి రాలేదు కూడా. 

+రాష్ట్రంలో ఎవరూ ఇలా శిలా ఫలకాలు వేసి హడావిడి చేయలేదు, ఏకంగా అందులో పవన్ కల్యాణ్ ని సీఎంని చేసేశారు నాయకులు. ఈ వ్యవహారం మరీ వింతగా, విడ్డూరంగా ఉందంటున్నారు స్థానిక నాయకులు. మరీ ఇంత అత్యుత్సాహమేంటని ప్రశ్నిస్తున్నారు. మరి జనసేన అధిష్టానానికి తెలిసే ఈ శిలా ఫలకం వేశారా, లేక అధిష్టానం ఇలాంటి వ్యవహారాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుందా అనేది తేలాల్సి ఉంది.