వైసీపీలో కొన్ని చోట్ల అంతర్గత రాజకీయాలు, ఆధిపత్యపోరు కొనసాగుతోంది. కానీ ఎక్కడా, ఎవరూ బయటపడటంలేదు. ఎన్నికల ఏడాది దగ్గరకొచ్చేసరికి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతంలో మంత్రి పదవి కోల్పోయినప్పుడు కూడా బాలినేని శ్రీనివాసులరెడ్డి ఇంత బాధపడలేదు. కానీ ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి హెలిప్యాడ్ వద్దకు తనకు అనుతివ్వకపోవడంతో ఆయన షాకయ్యారు. చివరకు సీఎం జగన్ ఫోన్ చేసి పిలిపించుకున్నారు. ఈఘటనలో సీఐ శ్రీనివాసరావుకి ఛార్జి మెమో ఇప్పించారు. అయితే ఇక్కడితో ఈ వివాదాన్ని వదిలిపెట్టలేదు బాలినేని. దీని వెనక ఎవరున్నారో వారికే చెక్ పెడతానంటూ సన్నిహితుల వద్ద మాట్లాడారు. బాలినేని వ్యాఖ్యలు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. 


ప్రకాశం జిల్లా నుంచి గతంలో బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఆదిమూలపు సురేష్ ఇద్దరూ మంత్రులుగా ఉండేవారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో బాలినేనికి పదవి పోయింది. అదే సమయంలో ఆదిమూలపు సురేష్ కి రిజర్వ్డ్ కోటాలో మళ్లీ పదవి దక్కింది. దీంతో బాలినేని కాస్త నొచ్చుకున్నారు. సీఎం జగన్ కి దగ్గరి బంధువైనా.. సామాజిక వర్గం విషయంలో ఆయనకు పదవి పోయింది. మంత్రి పదవి లేకపోయినా పార్టీలో ఆయన హవా మాత్రం కొనసాగుతోంది. ఇటీవల నెల్లూరు జిల్లా రాజకీయాల్లో బాలినేని చక్రం తిప్పారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి పార్టీకి దూరం జరిగిన సందర్భంలో మంతనాలు సాగించి ఆ వ్యవహారాన్ని చక్కదిద్ది, చివరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కొత్త ఇన్ చార్జ్ ని నిలబెట్టే వరకు బాలినేనే పార్టీ వ్యవహారాలు చూశారు. కానీ ఇప్పుడు ఆయన సొంత జిల్లాలోనే అవమానం జరగడంతో రగిలిపోతున్నారు. 


వాస్తవానికి బాలినేని సీఎం జగన్ వచ్చే సమయంలో రాజశ్యామల యాగం చేస్తున్నారట. యాగం మధ్యలోనుంచే ఆయన జగన్ కోసం వెళ్లారు. అయితే పోలీసులు ఆయన్ను హెలిప్యాడ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో ప్రోటోకాల్ ప్రకారం జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్ కారు నేరుగా హెలిప్యాడ్ వద్దకు వెళ్లింది. ఇక్కడే బాలినేని ఇగో దెబ్బతిన్నట్లు స్థానికంగా వినిపిస్తోంది. జిల్లాలో తనను అడ్డుకునే పోలీసులు ఎవరంటూ ఆరా తీశారు. కొండెపి సీఐ శ్రీనివాసరావు అత్యుత్సాహంతో బాలినేనిని అడ్డుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయనకు మెమో ఇచ్చారు. 


ఇక్కడితో ఈ కథ ముగిసిపోలేదు. కేవలం ఓ సీఐ తనను పొరపాటున అడ్డుకున్నాడని బాలినేని సర్దిచెప్పుకోవడం లేదు. దీని వెనక కీలక నేత ఉన్నారని ఆయన సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఆ కీలక నేతతో ఆయన డైరెక్ట్ ఫైట్ కి దిగబోతున్నారా..? అదనుకోసం వేచి చూస్తారా..? అనేది తేలియాల్సి ఉంది. 


2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి గెలిచారు. 2019నాటికి ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. పార్టీ పదవి ఇచ్చారు, టీటీడీ చైర్మన్ గా కొనసాగిస్తున్నారు. బాలినేనికి, వైవీ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలున్న సంగతి తెలిసిందే. మరి బాలినేని నర్మగర్భ వ్యాఖ్యలు ఎవరి గురించి అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.  స్థానిక మంత్రి ఆదిమూలపు సురేష్ తో బాలినేనికి పొసగకపోయినా.. ఆయన్ను ఎప్పుడూ తనకి ప్రత్యర్థిగా బాలినేని భావించలేదు. మరి కొత్తగా మార్కాపురంలో రిగిన అవమానానికి బాధ్యులెవరు అనేది బాలినేని ఆలోచన. ప్రస్తుతానికి దాని వెనక ఎవరున్నారనేది ఆయన అంచనా వేసుకున్నారు. దానికి ఆధారాలు మాత్రం బయటపెట్టడం లేదు. బాలినేని అలక ఆగ్రహంగా మారుతుందా, లేక చల్లారుతుందా తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.