ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కెరానో పెరాలసిస్ కేసు వెలుగు చూసింది. గతేడాది భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఓ వ్యక్తి పొలంలో పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. దీని వల్ల లైట్నింగ్ ఇంజురీ అయి అరుదైన కెరానో పెరాలసిస్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. రాష్ట్రంలో ఈ కేసు వెలుగు చూడడం ఇదే ప్రథమం కాగా.. దేశంలో ఇది రెండోది. వైద్య నిపుణులు వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స అందించడంతో బాధితుడు పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం వైద్యులు వెల్లడించారు.
వెండి చైను ఎంత మేర ఉంటే అంత..
ఏపీలోని ప్రకాశం జిల్లా పాతమాగులూరుకు చెందిన సంగటి వెంకట్ రెడ్డి(36) గతేడాది నవంబర్ 16న పొలం పనులు చేసేందుకు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. అప్పుడే భారీ వర్షం మొదలైంది. కానీ త్వరగా పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లాలనుకున్న వెంకట్ రెడ్డి... కాల్వ గట్టు మీద పని చేస్తున్నాడు. అప్పుడే భారీ శబ్దంతో ఒక్కసారిగా పిడుగు పడింది. ఆయనకు వంద మీటర్ల దూరంలోనే పిడుగు పడింది. అయినప్పటికీ.. ఆ ధాటికి మిల్లీసెకన్‌లో 50 వేల యాంప్‌ల విద్యుత్ వెంకట్ రెడ్డి శరీరంలోకి చొచ్చుకెళ్లింది. దీంతో ఆయన మెడలో ఉన్న వెండి గొలుసు కరిగిపోయింది. గొలుసు ఉన్నంత మేర ఛాతీ భాగం మొత్తం కాలిపోయింది. అయితే విషయం గుర్తించిన స్థానికులు అతడిని వెంటనే గుంటూరులోని బ్రింద న్యూరో సెంటర్ కు తీసుకు వెళ్లారు. తీసుకెళ్లారు.
కాళ్లూ, చేతులూ చచ్చుబడి..
కానీ అత్యధిక స్థాయిలో ఎడ్రినల్ గ్రంథి స్రావాలు వెన్నుముకలోకి విడుదల అయ్యాయి. ఫలితంగా వెంకట్ రెడ్డి, కాళ్లూ, చేతులూ చచ్చుబడి అత్యంత అరుదైన కెరానో పెరాలసిస్ కు గురయ్యాడు. ఈ విషయాన్ని గుర్తించిన డాక్టర్ భవనం హనుమా శ్రీనివాస రెడ్డి.. విటామిన్ సప్లిమెంట్లు నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ మందులు ఇచ్చి పది నెలల పాటు చికిత్స అందించడంతో బాధితుడు కోలుకున్నాడు. కొంచెం కొంచెంగా కోలుకుంటూ ఏడాదికి పూర్తిగా దాని నుంచి బయట పడ్డారని వివరించారు. ఈ అరుదైన కేసును అంతర్జాతీయ వైద్య గ్రంథాలకు పంపుతున్నట్లు తెలిపారు.