సంక్షేమ కార్యక్రమాల నిధులు విడుదల చేసే సందర్భంలో సీఎం జగన్ ల్యాప్ టాప్ బటన్ నొక్కడం ఆనవాయితీ. ఆయన ల్యాప్ టాప్ బటన్ నొక్కిన తర్వాత నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయినట్టు స్క్రీన్ పై వారి జాబితా కనపడుతుంది. అయితే ఈసారి ఈబీసీ నేస్తం విడుదల సందర్భంగా మార్కాపురంలో జరిగిన సభలో నిధులు విడుదలయ్యాయి. కానీ ల్యాప్ టాప్ పై బటన్ నొక్కింది సీఎం జగన్ కాదు. మాజీ మంత్రి బాలినేని. దీనికో ప్రత్యేక కారణం ఉంది. 


ఈబీసీ నేస్తం నిధుల విడుదల కోసం ఈరోజు సీఎం జగన్ ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్లారు. ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. అయితే ఈ సభలో మరో ఆసక్తికర సంఘటన జరిగింది. సీఎం జగన్ పర్యటనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి అవమానం జరిగింది. సీఎం జగన్ హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు జగన్ కి అనుమతి ఇవ్వలేదు. ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. కారు దూరంగా పార్క్ చేసి నడిచి వెళ్లాలని చెప్పారు. దీంతో బాలినేని నొచ్చుకున్నారు. అక్కడినుంచి తిరిగి వెళ్లిపోయారు. 


ఈబీసీ నేస్తం సభ ప్రారంభమైనా బాలినేని సభా ప్రాంగణంలోకి రాలేదు. స్టేజ్ పై కూడా బాలినేని లేకుండానే కార్యక్రమం మొదలైంది. జిల్లా నేతలతోపాటు మంత్రులు.. సీఎం జగన్ తో కలసి ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. మరోవైపు మీడియాలో బాలినేని వ్యవహారం హైలెట్ గా మారింది. ఆయన అలిగారని, సొంత జిల్లాలోనే తనకు అవమానం జరిగిందని వెనక్కి వెళ్లిపోయారని వార్తలొచ్చాయి. అటు స్టేజ్ పై బాలినేని కనపడకపోవడంతో జగన్ కూడా ఆరా తీశారు. బాలినేని అలిగి వెళ్లిపోయారని తేలడంతో ఆయనకు కబురు పంపించారు. వెంటనే ఆయన్ను సభా ప్రాంగణానికి తీసుకు రావాలని అధికారుల్ని ఆదేశించారు. 


జగన్ ఆదేశాలతో అధికారులు అప్రమత్తం అయ్యారు సీఎం జగన్ ప్రసంగం ముగిసేలోగా బాలినేని ఎక్కడున్నారో కనుక్కొని ఆయన్ను సభా వేదికవద్దకు తీసుకొచ్చారు. ఆ వెంటనే ఆయన వేదికనెక్కారు. సభ ప్రారంభంలో బాలినేని అక్కడ లేకపోయినా సీఎం జగన్ ప్రసంగం ముగిసేలోగా ఆయన మార్కాపురం వచ్చారు. జగన్ తోపాటు వేదికపైకి వచ్చారు. సరిగ్గా నిధుల విడుదల సమయంలో బాలినేని స్టేజ్ ఎక్కారు. జగన్ ఆయన్ను దగ్గరకు తీసుకున్నారు. ఆయనతోనే ల్యాప్ టాప్ పై బటన్ నొక్కించి నిధులు విడుదల చేశారు. దీంతో బాలినేని అలకపాన్పు దిగారు. సీఎం జగన్ పర్యటనలో బాలినేని వ్యవహారం కలకలం రేపినా చివరకు నేరుగా జగనే చొరవ తీసుకుని సమస్య పరిష్కరించారు. బాలినేని అలక తీర్చారు. 


ఈబీసీ నేస్తం కార్యక్రమం ద్వారా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ.. ఇతర ఓసీ కులాలలోని పేద మహిళలకు సీఎం జగన్ ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈబీసీ వర్గాలకు చెందిన 4,39,068 మంది లబ్ధిదారులకు రూ.658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని విడుదల చేసింది ప్రభుత్వం. ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఓసీ వర్గాల పేద మహిళలకు ప్రతి ఏటా 15వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం. వరుసగా మూడో ఏడాది కూడా నిధులు విడుదల చేశారు.