పసుపు పండగ నేటి నుంచే ప్రారంభం. 2024 ఎన్నికలకు నేతలను, కార్యకర్తలను సిద్ధం చేసేందుకు తెలుగు దేశం రెడీ అయింది. ఒంగోలు వేదికగా రెండు రోజు పాటు నిర్వహించే మహానాడుకు సర్వం సిద్ధమైంది.


ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశ రాజకీయాల్లోనే తెలుగుదేశం పార్టీ పెను సంచలనం. పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి 40 ఏళ్లల్లో ఎన్నో ఘన విజయాలు సాధించింది. అంతకు మించిన సంక్షోభాలను కూడా ఎదుర్కొంది. 


తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా అలాంటి పరీక్షలనే ఎదుర్కొంటోంది. అందుకే మరోసారి వారిలో ఉత్తేజం నింపి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా ప్లాన్ చేస్తోంది టీడీపీ. అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఓవైపు కేసులు మరోవైపు నేతల మధ్య ఉన్న విభేదాలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. 


కీలకమైన నేతలు చాలా మంది ఇప్పటికి కూడా సైలెంట్‌గా ఉండిపోతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల బెడద ఎక్కువైందని... అందుకే చాలా మంది నాయకులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదని టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో నేతల్లో, శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి పోరాటాలు చేస్తే పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వాలని చూస్తోంది టీడీపీ. 






మొన్నటికి మొన్న చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లింది. దీనికి ప్రజల నుంచి భారీ స్పందన లభించిందని.. పార్టీ విశ్లేషిస్తోంది. ఇన్నాళ్ల నుంచి పార్టీపై ఉన్న అపోహ తొలగిపోయిందని అంటున్నారు నేతలు. ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేపట్టేందుకు కార్యాచరణ తీసుకునే ఆవకాశం కూడా ఉంది. 


కరోనా టైంలో అన్‌లైన్‌లో మహానాడు నిర్వహించిన తెలుగుదేశం... 2018 తర్వాత తొలిసారిగా అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఒంగోలులో జరిగే ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, నేతలు తరలి వచ్చారు. 


8.30 గంటలకు ప్రతినిధులు నమోదుతో మహానాడు ప్రారంభమవుతుంది. తర్వాత ఉదయం 10 గంటలకు ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరం ప్రారంభిస్తారు. ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి... మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంతాప తీర్మానం ప్రవేశ పెడతారు. 11.45కు  చంద్రబాబు ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. తర్వాత తీర్మానాలపై చర్చ జరుగుతుంది. మొత్తం  17 తీర్మానాలు ప్రవేశ పెడతారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ తీర్మనాలే ఎక్కువగా ఉంటాయి.