Dagadarthi Airport In Nellore: అమరావతి: కూటమి ప్రభుత్వం ఏపీలో విమానాశ్రయాల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. పలు నగరాలకు ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీతో తమ ప్రాంతం నుంచే విమాన ప్రయాణికులు రాకపోకలు పెరిగేలా చూస్తోంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా దగదర్తిలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం మొదటి దశ పనులను రూ.916 కోట్ల వ్యయంతో చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును PPP (పబ్లిక్- ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) మోడల్‌లో చేపట్టనున్నారు. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) దీనిని నిర్వహించనుంది. ప్రస్తుతం నిర్మాణ సంస్థ ఎంపిక కోసం ఏపీఏడీసీఎల్ అంతర్జాతీయ టెండర్‌ను ఆహ్వానించింది. అక్టోబర్ 10న ప్రీ-బిడ్ కాన్ఫరెన్స్ నిర్వహించనుండగా.. బిడ్లు దాఖలుకు నవంబర్ 3 వరకు అవకాశం ఇచ్చింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విమాన సేవలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విమానాశ్రయం నిర్మాణం చేపడుతోంది. పారిశ్రామిక, పర్యాటక కార్యకలాపాలు పెరుగుతున్నందున దగదర్తి విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలతో పాటు సరుకు రవాణా విస్తృతంగా పెరుగుతాయని ఏపీఏడీసీఎల్ అంచనా వేసింది. నెల్లూరులోని దగదర్తి విమానాశ్రయం అందుబాటులోకి వస్తే కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని ఏపీఏడీసీఎల్ భావిస్తోంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి విమానాశ్రయ నిర్మాణ సంస్థతో ప్రభుత్వం 45 ఏళ్ల పాటు అమలులో ఉండే రాయితీ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ప్రతి 15 సంవత్సరాలను ఓ దశ కింద తీసుకుని.. దశల వారీగా ప్రణాళిక రూపొందించారు. మొదటి దశలో డిమాండ్ తక్కువగా ఉండగా, రెండో దశలో డిమాండ్ పెరిగి, మూడో దశలో గరిష్ట స్థాయికి చేరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. భవిష్యత్‌లో ప్రయాణికుల సంఖ్యతో పాటు కార్గో సేవలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రారంభ దశలో ఎయిర్‌బస్ A-320/A-321 తరహా మీడియం సైజు విమానాలు నడిపాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి దగదర్తి విమానాశ్రయంలో ఒకే ఒక రన్‌వే నిర్మించనున్నారు.
దగదర్తిలో విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి అనుమతుల విషయంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించడంతో పాటు 1,300 ఎకరాల భూమిని సేకరించింది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ప్రాథమిక అనుమతులు తీసుకుంది. అలాగే రక్షణ, హోంశాఖల అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. 2017లోనే పర్యావరణ, అటవీ అనుమతులు లభించాయి. టర్బో కన్సార్షియం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నిర్మాణ బాధ్యత అప్పగించగా, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ సంస్థ ఒప్పందం నుంచి తప్పుకుంది. తరువాత ఆ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి, తెట్టు (ప్రకాశం జిల్లా) వద్ద కొత్త విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దగదర్తి విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.