మాండూస్ తుపాను ఏపీ తీరాన్ని వణికిస్తుందని, అతలాకుతలం చేస్తుందని గత నాలుగు రోజులుగా హెచ్చరికలు వినపడుతూనే ఉన్నాయి. అయితే దీని ప్రభావం ఈరోజు రాత్రి తీరం దాటే సమయంలో బయటపడుతుందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ కోస్తా తీరంలో చిరు జల్లులే ఉన్నా.. తుపాను తీరం దాటే సమయంలో దీని ఉద్ధృతికి అల్లకల్లోలం జరిగే అవకాశముందని అంటున్నారు.  ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మాండూస్ కొనసాగుతోంది.


వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. గడిచిన 6 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా గంటకు 12కిలోమీటర్ల వేగంతో ఈ తుపాన్ కదులుతోంది. శ్రీలంకలోని జాఫ్నాతీరానికి తూర్పు ఆగ్నేయంగా 240కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. కారైకాల్‌ కి 240 కి.మీ., చెన్నైకి 320 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని అధికారులు చెబుతున్నారు. రాబోయే ఆరు గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారుతుందని ఆ తర్వాత క్రమంగా తుపాను బలహీన పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు(శుక్రవారం) అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారు ఝాము లోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో మాండూస్ తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  


మాండస్‌ తుపాను హెచ్చరికల నేపథ్యంలో కోస్తా జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తత ప్రకటించింది. పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య ఈ రోజు అర్థరాత్రి తుపాను తీరం దాటిన సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌ బాబు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని తీర ప్రాంత మండలాలైన కావలి, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు, ముత్తుకూరుపై ప్రత్యేక దృష్టిసారించాలని చెప్పారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తీర ప్రాంత గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని సూచించారు.  


నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌ లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. తుపాను సహాయ చర్యలు, నష్ట నివారణకు కలెక్టరేట్‌, తహశీల్దారు కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్ లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌లో 1077 నంబరును అందుబాటులో ఉంచారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అవసరమైన చోట వైద్య శిబిరాలు, 108, 104 వాహనాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. మరోవైపు రాష్ట్ర విపత్తు దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం కూడా అందుబాటులో ఉంచారు.  


అటు తిరుపతి జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తిరుపతిలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితి సమీక్షించారు జిల్లా అధికారులు. ఈరోజు తుపాను తీరం దాటిన తర్వాత రేపటి నుంచి దాని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఈనెల 11 వరకు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే తుపాన ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది ఈరోజు రాత్రితో తేలిపోతుంది. నిన్నటి వరకు తుపాను ప్రభావం పెద్దగా లేకపోయినా ఈరోజు గాలులు తీవ్రం అయ్యాయి. భారీ ఈదురు గాలులతో కోస్తా జిల్లాలు వణికిపోతున్నాయి. అయితే వర్షాలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. రాత్రికి గాలులకు వర్షం తోడయితే తుపాను ముప్పు పెరిగినట్టే భావించాలి.