ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులు అయిన గిడుగు రుద్రరాజు ఈ రోజు బాధ్యతలు తీసుకోనున్నారు. తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఆయన బాధ్యతలు తీసుకోవడం కోసం ఈ రోజు వరకూ వేచి ఉన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలను ఆహ్వానించడం తో కేవీపీ లాంటి వారంతా విజయవాడ చేరుకున్నారు.


విశాఖపట్నంలో నాదెండ్ల మనోహర్, వైవీ సుబ్బారెడ్డి పర్యటనలు
విశాఖపట్నంలో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఈరోజు పర్యటించనున్నారు. సంస్థాగతంగా జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో భాగంగా ఆయన పార్టీ కేడర్ తో సమావేశం కానున్నారు.


విశాఖ చేరుకున్న వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ చేరుకున్నారు. వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ హోదాలో ఆయన పార్టీ కీలక నేతలతో భేటీ కానున్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు.


దూసుకొస్తున్న తుపాను - చిత్తూరులో స్కూళ్లకు సెలవు
మాండూస్ తుపాను నేపథ్యంలో నేటి మధ్యాహ్నం పాఠశాలలు, కళాశాలలకు సెలవుప్రకటిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉందాలని సూచించారు


గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
"ఇదేం ఖర్మ" కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లాలో రెండో రోజూ పర్యటించనున్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. అందులో భాగంగా పొన్నూరు నుంచి రోడ్డు మార్గంలో బాపట్ల మండలం చుండూరుపల్లికి శుక్రవారం మధ్యాహ్నం 3.15కు చేరుకుంటారు. సాయంత్రం 5.30 కు గుంటూరు మార్గంలో ఆర్వోబీ నుంచి రోడ్‌ షో ప్రారంభం అవుతుంది. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహ కూడలిలో బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడతారు. రాత్రి 8 గంటలకు బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలకు చేరుకొని అతిథి గృహంలో బాబు బస చేస్తారు.


అక్కడే ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎస్సీ నేతలు, విద్యార్థులతో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ముఖాముఖి నిర్వహిస్తారు. రానున్న ఎన్నికలకు టీడీపీ శ్రేణులను సమాయత్తం చేయడానికి దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు స్టూవర్టుపురంలో గిరిజన మహిళలతో చంద్రబాబు సమావేశం అవుతారు. అనంతరం చీరాలకు బయలుదేరతారు.