అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారని, ఇంటికి వెళ్తే దాడి చేసి కొట్టి బయటకు గెంటేశారని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేశారు. సగటు మహిళ ఇలా బాధపడటం అక్కడక్కడ చూస్తున్నాం. కానీ ఆమె ఓ హెడ్ కానిస్టేబుల్ కుమార్తె. తండ్రి పోలీసయినా కూడా కూతురికి ఇలాంటి కష్టమేంటన్న ప్రశ్న వినిపిస్తోంది.
నెల్లూరుకు చెందిన హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ నజీర్ తన కుమార్తె షేక్ హీనాకు కావలి పట్టణానికి చెందిన సలీం బాబాతో ఐదేళ్ల క్రితం వివాహం జరిపించాడు. సలీం బాబా తండ్రి షేక్ షాహుల్. ఆయన కావలి మున్సిపల్ మాజీ కౌన్సిలర్. వివాహం జరిగిన కొంతకాలం తరువాత భార్యను తీసుకుని బెంగళూరుకు వెళ్లిన సలీంబాబా అక్కడ చేసిన అప్పులు తిరిగి చెల్లించలేక తప్పించుకు తిరుగుతూ కావలికి వచ్చేశాడు. పెళ్లి టైమ్‌లో 16 లక్షలు కట్నం ఇచ్చారని, బెంగళూరులో పెద్ద ఉద్యోగం అని అబద్ధం చెప్పి పెళ్లి చేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. అయినా కూడా సర్దుకుని వెళ్దామంటే అత్తమామలు, భర్త తనని కొట్టి పంపించేశారంటోంది బాధితురాలు హీనా.
మధ్యతరగతి తండ్రిని, పైగా నేను పోలీసని, ఇక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఏం న్యాయం అడిగేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హెడ్ కానిస్టేబుల్ నజీర్. నాలుగేళ్ల బిడ్డతోపాటు హీనాను ఆమె తండ్రి వద్దకు పంపించేశాడు భర్త. తాను ఇక జాబ్ చెయ్యనని, కావలిలోనే ఉంటానని గొడవ చేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఎన్ని దఫాలు భర్తకు ఫోన్ చేసినా స్పందించకపోగా నెంబరును బ్లాక్ లిస్ట్‌లో పెట్టాడు.
ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ నజీర్, కుమార్తె తరపున మాట్లాడటానికి అల్లుడి వద్దకు వెళ్లాడు. కానీ వారిపై దాడి చేసి కొట్టి బయటకు గెంటేశారని అంటున్నారు. ఈ విషయాన్ని వారు దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న స్థానిక పోలీసులు భర్తను అదపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. ఎమ్మెల్యే మనుషులమని చెప్పి తమను బెదిరిస్తున్నారని అంటున్నారు హెడ్ కానిస్టేబుల్ నజీర్.
భార్యా, భర్తలకు కౌన్సిలింగ్ ఇస్తామని అంటున్నారు ఎస్‌ఐ బాజిబాబు. దిశ యాప్ కాల్ ద్వారా తమకు ఫిర్యాదు అందిందని చెప్పారాయన.