కందుకూరు సభలో విషాదం చోటు చేసుకోవడంతో చంద్రబాబు టూర్ షెడ్యూల్ మారింది. వాస్తవానికి మూడు రోజులపాటు ఆయన నెల్లూరు జిల్లాలో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కందుకూరు, కావలి, కోవూరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించాల్సి ఉంది. తొలిరోజు కందుకూరు నియోజకవర్గంలో ర్యాలీ బాగానే జరిగినా, బహిరంగ సభ మొదలయ్యే సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా మరికొందరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో సభను అర్థాంతరంగా ఆపేసిన చంద్రబాబు వెంటనే ఆస్పత్రికి చేరుకుని బాధితుల్ని పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. వారికి ఆర్థిక సాయం ప్రకటించారు.








గురువారం అంత్యక్రియలు..


తొక్కిసలాటలో మృతిచెందినవారు వేర్వేరు ప్రాంతాలనుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు. వీరిలో కందుకూరుకి చెందిన వారే ఎక్కువగా ఉండటంతో కందుకూరులో జరిగే అంత్యక్రియల కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారని తెలుస్తోంది. అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం ఆయన వారి కుటుంబాల వద్దే కొద్దిసేపు ఉంటారు. స్థానిక నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.


అంత్యక్రియలకోసం భారీ ఏర్పాట్లు..


అంత్యక్రియల సందర్భంగా కందుకూరులో భారీ ర్యాలీ చేపట్టేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేశాయి. అమరులైన పార్టీ కార్యకర్తలకోసం నాయకులంతా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కందుకూరులో బహిరంగ సభ అర్థాంతరంగా ముగిసినా గురువారం అంత్యక్రియల సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. ఇతర ప్రాంతాల్ల జరిగే అంత్యక్రియల కార్యక్రమాలకు కూడా ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ చార్జ్ లు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు.


యాత్ర ముందుకు సాగేనా..?


చంద్రబాబు యాత్రపై పార్టీనుంచి ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. ముందుగా ఉన్న షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రి కందుకూరులో విశ్రాంతి తీసుకుని, గురువారం ఆయన కావలిలో పర్యటించాల్సి ఉంది. కావలిలో కూడా సాయంత్రం వరకు రోడ్ షో, సాయంత్రం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. అందులోనూ చంద్రబాబు కందుకూరు పర్యటన రోజే కావలిలో ఓ విషాద సంఘటన జరిగింది. తనపై రౌడీ షీట్ తెరిచి వేధిస్తున్నారంటూ, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు హర్ష ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ యువకుడిని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కావలి రోడ్ షో లో చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ పై నిప్పులు చెరిగే అవకాశముంది. కానీ కావలి పర్యటనపై ఇంకా తుది సమాచారం అందలేదు.


యాత్ర వాయిదా పడుతుందా..?


చంద్రబాబు తన యాత్రను వాయిదా వేసుకుంటారని కొంతమంది చెబుతున్నా అందులో వాస్తవం లేదని, తుది సమాచారం అధికారికంగా తెలియజేస్తామంటున్నారు పార్టీ నాయకులు. అయితే కావలి, కోవూరు నియోజకవర్గాల పర్యటన కాస్త ఆలస్గమయ్యే అవకాశముంది. అంత్యక్రియల కార్యక్రమాలన్నీ పూర్తయ్యే వరకు చంద్రబాబు పర్యటన చేపట్టక పోవచ్చు. ఆ కార్యక్రమాల తర్వాత చంద్రబాబు తిరిగి జనంలోకి వస్తారని అంటున్నారు.


అప్పుడే విమర్శలు..


చంద్రబాబు ప్రచార ఆర్భాటాలకోసం టీడీపీ కార్యకర్తల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారంటూ అప్పుడే వైసీపీ సానుభూతి పరులు ట్విట్టర్లో వార్ మొదలు పెట్టారు. చంద్రబాబు వల్లే ఆ పార్టీ కార్యకర్తల ప్రాణాలు పోయాయని అంటున్నారు. దీనికి టీడీపీ నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. చంద్రబాబు కార్యకర్తల కోసం నిలబడే మనిషని, బాధిత కుటుంబాలను వెంటనే ఆదుకునేందుకు ఆయన ముందుకొచ్చారని సోషల్ మీడియాలో సమాధానమిస్తున్నారు టీడీపీ నేతలు.