నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన చివరిరోజు కోవూరులో రోడ్ షో నిర్వహించారు. బహిరంగ సభలో ప్రసంగించారు. కేజీ 2 రూపాయల బియ్యం, పక్కా ఇళ్లు, పేదలకు పెన్షన్లు ప్రవేశ పెట్టిన ఘనత ఎన్టీఆర్ ది అని గుర్తు చేశారు చంద్రబాబు. అందుకే ఆయన స్ఫూర్తితో అన్న క్యాంటీన్లు పెట్టామని, వాటిని నేడు జగన్ ధ్వంసం చేశారన చెప్పారు. జగన్ పాలనలో ఉన్నవి నవరత్నాలు కావని, నవమోసాలని చెప్పారు. ఎన్టీఆర్ 35 రూపాయలు పెన్షన్లు ఇవ్వగా, దాన్ని తాను 75 రూపాయలకు పెంచానని గుర్తు చేశారు. వైఎస్ఆర్ 200 రూపాయలకు పెంచగా, దాన్ని తాను 2వేల రూపాయలకు పెంచానన్నారు. ఇప్పుడు జగన్ పెన్షన్ల పెంపు పేరుతో పెన్షన్లలో కోత పెడుతున్నారన చెప్పారు. అర్హులను కూడా పెన్షన్ల లిస్ట్ నుంచి తీసేస్తున్నారని మండిపడ్డారు.


ఏపీకి ఒకే రాజధాని కావాలని అన్నారు. ప్రజల ఆమోదం కూడా ఒకే రాజధానికే ఉందని చెప్పారు. ప్రజలంతా అమరావతి మాత్రమే రాజధాని కావాలని కోరుకుంటున్నారన చెప్పారు. కర్నూలు ప్రజలు కూడా ఒకటే రాజధాని కావాలన్నారని చెప్పారు. జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని చెప్పారు. మూడు రాజధానులకోసం వెంపర్లాడితే జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. తండ్రిలేని కుటుంబం, తలలేని శరీరం లాగా ఏపీ ప్రస్తుతం ఉందన్నారు.


ఖబర్దార్ ముఖ్యమంత్రి అంటూ జగన్ ని హెచ్చరించారు. ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పనికిమాలిన ఎమ్మెల్యేలున్నారని అన్నారు. ప్రజలకు జగన్‌ పై ఎంత కోపం ఉందో టీడీపీ సభలకు వచ్చిన జనాన్ని చూస్తే అర్థమవుతుందని చెప్పారు చంద్రబాబు. డ్రోన్‌ షూటింగ్‌ లు అంటూ అనవసర విమర్శలు చేస్తున్నారని, తన సభకు వచ్చి చూస్తే వాస్తవం అర్థమవుతుందని అన్నారు. తెలుగు బిడ్డల భవిష్యత్తుకు ఐటీ అనే ఆయుధాన్ని తానిచ్చానన్నారు. ప్రపంచం మొత్తం తెలుగు వాళ్లు జయించారంటే అది తానిచ్చిన ఆయుధం చలవేనన్నారు. భస్మాసురుడు వచ్చి ఒక ఛాన్స్ అని అడిగితే జనం మోసపోయారని చెప్పారు. భస్మాసురుడికి ఒక అవకాశం ప్రజలిస్తే.. వారిపైనే చేయి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంద ని చెప్పారు. సీఎం జగన్ ప్రజల్ని మనుషుల్లా చూడకుండా బానిసల్లా చూస్తున్నారని ఆరోపించారు.


బాలకృష్ణ డైలాగుని గుర్తు చేసుకోవాలని, సమయం లేదు మిత్రమా అని అన్నారు చంద్రబాబు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని అందుకే పేరు పెట్టామన్నారు. ఈ పేరు కరెక్టేనా అని ప్రశ్నించారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందాన.. జగన్ దోపిడీని చూసి ఎమ్మెల్యేలు కూడా దోపిడీకి అలవాటు పడ్డారన్నారు. నెల్లూరు జిల్లాలో ఎవరైనా లే అవుట్ వేయాలంటే ఎకరాకు రూ.10లక్షల చొప్పున వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు నష్టపోతే కనీసం వారివైపు చూడని మంత్రి జిల్లాలో ఉన్నారని ఆరోపించారు. తనపై అనవసరంగా నోరు పారేసుకునే ముందు రైతులకు మంత్రిగా ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అన్‌ స్టాపబుల్‌ అని, రాష్ట్ర భవిష్యత్తు కోసం బుల్లెట్ లా దూసుకుపోతుందని చెప్పారు చంద్రబాబు.