కందుకూరు దుర్ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు చంద్రబాబు అండగా నిలిచారు. మృతదేహాలకు ఆయన ఘన నివాళులర్పించారు. ఆయా కుటుంబాలను దగ్గరుండి ఓదార్చారు చంద్రబాబు. మృతుల కుటుంబాలకు టీడీపీ ఆర్థిక సాయం పెంచింది. ఒక్కో కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఆర్థిక సాయం పార్టీ తరపున ప్రకటించారు. ఇక టీడీపీ నాయకులు కూడా మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించారు. ఈ మొత్తం సాయం కలిపి ఒక్కో కుటుంబానికి రూ.24 లక్షలు అందబోతోంది. గాయపడిన వారికి 50వేల రూపాయల చొప్పున సాయం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం దీనికి అదనం.




టీడీపీ తరపున మృతుల కుటుంబాలకు అందే సాయం..


1.తెలుగు దేశం పార్టీ ఆర్థిక సాయం రూ.15,00,000/-


2.ఇంటూరి నాగేశ్వర్ రావు రూ. 1 లక్ష


3.ఇంటూరి రాజేష్ రూ.1 లక్ష


4.శిష్ట్లా లోహిత్ రూ. 1 లక్ష


5.బేబీ నాయన రూ.50,000


6.కేశినేని చిన్ని రూ.50,000


7.కంచర్ల సుధాకర్ రూ.2 లక్షలు.


8.కంచర్ల శ్రీకాంత్ రూ. 1 లక్ష


9.అబ్దుల్ అజీజ్ రూ.50,000


10 పోతుల రామారావు రూ.50,000


11.పొడపాటి సుధాకర్ రూ.50,000


12.వెనిగండ్ల రాము రూ. 50,000


15మందికి గాయాలు కాగా వారి వైద్య ఖర్చులను టీడీపీ భరిస్తోంది. వారికి ఆర్థిక సాయంగా 50వేల రూపాయలను అందిస్తున్నారు నేతలు. ఈరోజు మధ్యాహ్నం వరకు చంద్రబాబు కందుకూరులోనే ఉంటారు. భోజన విరామం తర్వాత కావలిలో జరుగు రోడ్ షో లో పాల్గొనడానికి చంద్రబాబు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 3.45 గంటలకు కావలి నియోజకవర్గం చేరుకుంటారు. కావలి అండర్ పాస్ మాల్యాద్రి కాలనీ, ఓగూరు, కన్నమల వద్ద ఆగి నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు భాష్యం పాఠశాల మీదుగా రోడ్ షో ఉంటుంది. 5.30 గంటలకు కావలిలోని ఒంగోలు బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ జరుగుతుంది. రాత్రి 7.30 గంటలకు బృందావనం కళ్యాణ మండపంలో బస చేస్తారు చంద్రబాబు.


కందుకూరులో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని కావలి పర్యటనలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు పార్టీ ప్రతినిధులు. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల్ని గుమికూడకుండా.. కాస్త దూరంగా ఉండేలా బ్యారికేడ్లు ఏర్పాటు చేయబోతున్నారు. కావలిలో చంద్రబాబు ప్రసంగించే బస్టాండ్ సమీపంలో ఇప్పటికే ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. దుర్ఘటన తర్వాత పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. కావలిలో ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు.


మూడోరోజు చంద్రబాబు కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. కందుకూరు ఘటన తర్వాత ఆయన పర్యటన షెడ్యూల్ కాస్త మారింది. కావలిలో రోడ్ షో అనుకున్నంత సేపు జరిగే అవకాశం లేదు. రోడ్ షో త్వరగా ముగించుకుని ఆ తర్వాత బహిరంగ సభకు వస్తారు చంద్రబాబు. కోవూరులో మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత కోవూరులో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ నెలాఖరులో చంద్రబాబు కుప్పం పర్యటన కూడా ఖరారైంది.