మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయ్యప్ప మాల ధరించి, ముస్లింలకు సంబంధించిన టోపీ పెట్టుకోవడం సరికాదంటూ బీజేపీ విమర్శలు చేస్తోంది. అయ్యప్పమాలను అపవిత్రం చేశారంటూ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ట్విట్టర్లో ఓ వీడియో విడుదల చేశారు. దీంతో నెల్లూరులోని అనిల్ ఇంటి ముందు బీజేపీ, బీజేవైఎం నేతలు ధర్నా చేపట్టారు. అయ్యప్పస్వామి చిత్ర పటాన్ని చేతిలో పట్టుకుని ఆయన ఇంటి ముందు బైఠాయించారు. అయ్యప్ప స్వాములకు అనిల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని తరలించే క్రమంలో ఒక్కసారిగా అనిల్ అనుచరుడొకరు రాయి తీసుకుని ఆ గుంపుపై వేశాడు. దీంతో అతడిని కూడా పోలీసులు పక్కకు లాగేశారు. అనిల్ ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.




మాజీ మంత్రి అనిల్ ప్రస్తుతం అయ్యప్పమాల ధరించి ఉన్నారు. గడప గడప కార్యక్రమంలో కూడా ఆయన మాలధారణతోనే పాల్గొంటున్నారు. ఇటీవల అనిల్ నెల్లూరులోని ఖుద్దూస్ నగర్లో పర్యటించిన సందర్భంగా మైనార్టీలతో సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆయన ముస్లింలు ధరించే టోపీ పెట్టుకున్నారు. దీనిపై ఇప్పుడు బీజేపీ విమర్శలు చేస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ అయ్యప్ప మాలలో ఉన్నప్పడు అన్యమతాలకు చెందిన వస్త్రధారణ ఎందుకు చేశారంటూ మండిపడ్డారు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి. ట్విట్టర్లో ఆయన ఓ వీడియో విడుదల చేశారు.


ఏపీలో వైసీపీ నేతలు ప్రతిరోజూ ఏదో ఒక వివాదాస్పద అంశాలతో హిందువులను అవమానిస్తున్నారని విష్ణువర్దన్ రెడ్డి ట్విట్టర్లో ఓ కామెంట్ పెట్టారు. తాజాగా అనిల్ కుమార్ యాదవ్ హిందువులను అవమానించారని, వెంటనే వైసీపీ అధిష్టానం దీనిపై స్పందించాలన్నారాయన. అనిల్ కుమార్ యాదవ్ అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పాలని, పార్టీ దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు విష్ణువర్దన్ రెడ్డి.


విష్ణువర్దన్ రెడ్డి వీడియో విడుదల చేసిన తర్వాత దానికి కౌంటర్ గా వైసీపీ నుంచి కూడా వివరణలు వచ్చాయి. గతంలో బీజేపీ నేతలు అయ్యప్పమాల ధరించి చెప్పులు వేసుకున్న వీడియోలను, ఫొటోలను వైసీపీ నేతలు షేర్ చేశారు. అయ్యప్ప మాల ధరించి టోపీ పెట్టుకోవడం తప్పేంటని ప్రశ్నించారు. పరమత సహనం ఉండాలనేదే హిందూ మత ధర్మం అని దాన్ని, ఇలా తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు.


అయితే విష్ణు వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాజీ మంత్రి అనిల్ ఈ వ్యవహారం జరిగిన సమయంలో నెల్లూరులో లేరు. ఆయన విజయవాడలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు. అనిల్ లేని సమయంలో బీజేపీ నేతలు ఆయన ఇంటిముందు చేసిన రగడ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గొడవ చేసినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో బీజేవైఎం నేతలపై రాళ్లదాడి జరిగిందని వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనిల్ వర్గం వారు తమని రాళ్లతో కొట్టారని అన్నారు. కొన్ని వీడియోల్లో రాళ్లు వేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కావడంలేదు.


మొత్తమ్మీద, అనిల్ వ్యవహారం ఇటు నెల్లూరులోనే కాదు, అటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సున్నిత అంశాలను బీజేపీ రాజకీయం చేయాలని చూస్తోందని వైసీపీ మండిపడుతోంది. అనిల్ ముస్లింలకు టోపీ పెట్టుకోవడం ఇదే తొలిసారి కాదని, ఆయన అన్నిరకాల మత సంప్రదాయాలను పాటిస్తారని చెబుతున్నారు అనుచరులు. అయ్యప్ప మాల ధరించినా అన్యమతాలను గౌరవించడం మన సంప్రదాయం అంటున్నారు. అందుకే ఆయన టోపీ ధరించాడని వివరణ ఇస్తున్నారు.