ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బాలినేని శ్రీనివాసులరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కోఆర్డినేటర్ పదవికి ఆయన రాజీనామా చేయడం, ఆ తర్వాత జగన్ బుజ్జగించడం, అయినా బాలినేని బెట్టువీడక పోవడం అన్నీ తెలిసిందే. అయితే ఆ తర్వాత వైసీపీ రియాక్షనే కాస్త వయలెంట్ గా ఉంది. అసలు కప్పులో టీయే లేదు, ఇక తుపానెక్కడిది అంటూ ఆ వ్యవహారాన్ని తీసిపారేసినట్టు మాట్లాడారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. బాలినేని వ్యవహారాన్ని ఆయన అంత తేలిగ్గా ఎందుకు తీసేశారు అనేదే ఇప్పుడు తేలాల్సిన విషయం. అయితే ఈలోగా బాలినేనిపై సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు, ఆయనపై వ్యతిరేకంగా వస్తున్న కామెంట్లు వైసీపీ-బాలినేని మధ్య దూరాన్ని పెంచుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. 


జగన్ చెప్పినా ఎందుకు ఒప్పుకోలేదు..
పార్టీకి బాలినేని అవసరం ఎంతైనా ఉంది, ఈ దశలో పార్టీ కూడా బాలినేనికి అంతే అవసరం. కానీ ఆయన డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. పార్టీ బాధ్యతలు తనకు వద్దన్నారు. సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోవాలి, నాక్కాస్త విశ్రాంతి కావాలంటున్నారు. అదే నిజమైతే ఇన్నాళ్లూ ఆ బాధ్యతల్ని ఆయన ఎందుకు మోశారు. పక్క జిల్లాల్లో సమస్యలు వచ్చినా వెళ్లి ఎందుకు చక్కబెట్టి వచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారాన్ని డీల్ చేసింది బాలినేనే. ఎంపీ ఆదాలను వెంటబెట్టుకుని జగన్ ని కలిసి, ఆయనకు నియోజకవర్గ ఇన్చార్జి పదవిని ఇప్పించింది కూడా ఆయనే. అలాంటి బాలినేని ఆ పెత్తనాన్ని ఎందుకు వదులుకుంటారు. మరి ఇప్పుడు ఎందుకిలా జరిగింది..?


బాలినేనికి శతృత్వం ఎవరితో..?
జిల్లా రాజకీయాలకు సంబంధించి బాలినేని శ్రీనివాసులరెడ్డికి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ అంటే పడదనే ప్రచారం ఉంది. అయితే జిల్లాపై పెత్తనం కోసం సురేష్ ఎప్పుడూ ప్రయత్నించలేదు. అనుకోకుండా ఆయన మంత్రి పదవి ఉంది, బాలీనేని పదవి ఊడింది.. అంతే తేడా. అంతమాత్రాన పదవులు శాశ్వతం అని సురేష్ అనుకోలేదు, ఆయన జిల్లాపై పెత్తనం కోరుకోలేదు కూడా. కానీ జిల్లాలో తనకు మంత్రి పదవిపోయి, సురేష్ కి కొనసాగించడంతో బాలినేని బాగా ఫీలయ్యారని తెలుస్తోంది. 


బాలినేని పాత శత్రువు వైవీ సుబ్బారెడ్డి. బంధువులైనా కూడా వారి మధ్య సఖ్యత లేదనే విషయం అందరికీ తెలుసు. ఇటీవల వైవీ సుబ్బారెడ్డికి పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి పెత్తనం తగ్గిన తర్వాత మళ్లీ సుబ్బారెడ్డిని తెరపైకి తెచ్చారు జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ ఉత్తరాంధ్రకు వైవీ ఇన్ చార్జ్ గా ఉన్నారు. పార్టీలో వైవీకి ప్రాధాన్యం పెరిగిందంటే, కచ్చితంగా అది బాలినేనికి ఇబ్బందే. అందుకే ఆయన కాస్త బెట్టు చూపించాలనుకున్నారు. పార్టీ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు.


జగన్ నుంచి పిలుపు రాగానే సర్దుబాట్లు ఉంటాయని వెళ్లారు. కానీ అక్కడ బుజ్జగింపులేవీ లేవని తేలిపోయింది. రాజీనామాని జగన్ మారు మాట్లాడకుండా ఒప్పుకున్నారు. బాలినేని తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. అందుకే సజ్జలనుంచి టీ లేదు, కప్పు లేదు, తుపాన్ లేదు అనే మాటలు వినిపించాయి. ఒకరకంగా జగన్ తో భేటీ తర్వాత బాలినేనికి తన భవిష్యత్తుపై ఓ క్లారిటీ వచ్చేసినట్టుంది. అదే సమయంలో ప్రకాశం జిల్లా జనసేన నాయకులు, బాలినేని తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామంటూ ముందుగానే స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.