నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సీఎం జగన్ కి మైతేమేనియా సిండ్రోమ్ అంటూ ఆరోపించారు. అందుకే ఆయన అబద్ధాలు చెబుతున్నారన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై కూడా విమర్శలు చేశారు లోకేష్. ఇప్పుడా విమర్శలకు కౌంటర్ ఇచ్చారు విక్రమ్ రెడ్డి. లోకేష్ కే మైతోమేనియా సిండ్రోమ్ ఉందన్నారు. అసలు టీడీపీ నేతలు ఆత్మకూరుకి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఆ తర్వాతే తమ పాలనపై మాట్లాడాలన్నారు.
టౌన్ లోకి వచ్చే ధైర్యం లేదా..?
నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిందని, అయితే ప్రధాన ప్రాంతాలు కాకుండా అటవీ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి ఆయన వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి. బహిరంగ సభలో ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారన్నారు సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్ ని కన్నింగ్ ముఖ్యమంత్రి అంటూ లోకేష్ కామెంట్ చేయడం సరికాదన్నారు విక్రమ్ రెడ్డి. 2014లో టీడీపీ మెనిఫెస్టో బయటపెట్టాలన్నారు. అసలు వారు ఏం పనులు చేశారో, ఏం హామిలిచ్చారో ప్రజలకు వివరించాలనన్నారు. 2019లో ముఖ్యమంత్రి జగన్ మేనిఫెస్టోలో ఏమేం అమలు చేశారో తాము వివరిస్తామన్నారు. అప్పుడు కన్నింగ్ ఎవరో ప్రజలే చెబుతారని స్పష్టం చేశారు విక్రమ్ రెడ్డి.
ఆనంకు అంత సీనుందా..?
మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు అభివృద్ది, అవినీతి అంటూ తీవ్ర విమర్శలు చేశారని, గతంలో ఆయన చేసిన పనులు ప్రజలందరికి తెలుసున్నారు విక్రమ్ రెడ్డి. ఆయన ఆత్మకూరు ప్రజలతోపాటు రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2009 నుండి 2014 ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో ఆనం సోమశిల హైలెవల్ కెనాల్ నిర్మాణ పనులు ఎందుకు చేయించలేకపోయారని నిలదీశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆనం ఆర్థికమంత్రిగా వ్యవహరించారని, ఐదు కోట్ల మంది ప్రజలు నష్టపోతారన్న విషయం తెలిసి కూడా కనీసం స్పందించకుండా ఉండిపోయారని విమర్శించారు. పదవిని పట్టుకునే ఉండి ప్రజలందరికి ఆయన అన్యాయం చేశారని చెప్పారు. స్వలాభం కోసం రాష్ట్ర అభివృద్దిని 20 సంవత్సరాలు వెనక్కు నెట్టిన ఆనం, ఆత్మకూరు అభివృద్దిపై విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
లోకేష్ ఆత్మకూరు గురించి మాట్లాడాలంటే ఎక్కడైనా తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. టైమ్ వాళ్లు చెప్పినా, తనను చెప్పమన్నా చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నారా లోకేష్ ఆత్మకూరు నియోజకవర్గం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆత్మకూరుకు వచ్చి వెళ్లాలన్నారు. ఆత్మకూరు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు విక్రమ్ రెడ్డి. ఇప్పటికే నియోజకవర్గంలో 3 జాతీయ రహదారులు ఉన్నాయని, రెండు పోర్టుల అనుసంధానం ద్వారా భవిష్యత్తులో పారిశ్రామికంగా అభివృద్ది జరుగుతుందని చెప్పారు. నిరుద్యోగ యువత కోసం అనేక జాబ్ మేళాలు నిర్వహించామని అన్నారు
సంగం, నెల్లూరు బ్యారేజ్ నిర్మాణాలు 2008లో ప్రారంభమైతే టీడీపీ అన్నేళ్లు ఎందుకు పూర్తి చేయలోకపోయిందని నిలదీశారు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి. సీఎం జగన్ ఆ రెండు బ్యారేజ్ లను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారని చెప్పారు. ఈనెల 23న ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో మేకపాటి గౌతమ్ రెడ్డి ఫౌండేషన్ సొంత నిధులతో మున్సిపల్ బస్టాండ్ ని ప్రారంభిస్తామని చెప్పారు. తాను శాసనసభ్యునిగా ఎన్నికై జూన్ 23 నాటికి ఒక సంవత్సరం పూర్తవుతుందని, ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ది ఏ విధంగా చేశానో ప్రజలంతా చూశారని అన్నారు.