నెల్లూరు జిల్లా పోలీసులు సెల్ ఫోన్ రికవరీలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఇటీవల కోటి రూపాయల విలువైన సెల్ ఫోన్లను బాధితులకు అప్పగించగా.. ఇప్పుడు కోటీ 25 లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్లను మరో దఫా బాధితులకు అప్పగించారు. ఈ సెల్ ఫోన్లను జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి స్వయంగా బాధితులకు అందించడం విశేషం. సెల్ ఫోన్ చోరీలు ఎక్కువవుతున్న నేపథ్యంలో పోలీసులు నూతన టెక్నాలజీ ఉపయోగించి వాటిని ఇట్టే పట్టేస్తున్నారు. సెల్ ఫోన్లు పట్టుకోవడం ఆలస్యం కావొచ్చేమో కానీ, అసాధ్యం కాదని చెబుతున్నారు నెల్లూరు జిల్లా పోలీసులు. 


500 సెల్ ఫోన్లు.. 
ప్రస్తుతం 500 సెల్ ఫోన్లను నెల్లూరు జిల్లా పోలీసులు రికవరీ చేశారు. వాటి విలువ కోటీ 25 లక్షల రూపాయలుగా తేల్చారు. వాటిలో వివిధ కంపెనీల ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లనే ఇటీవల కాలంలో కేటుగాళ్లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అందులోనూ సెల్ ఫోన్ల రేటు పెరిగిపోవడం, సగటున ప్రతి వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండటంతో దొంగలకు పని సులువు అవుతోంది. అయితే పోయిన సెల్ ఫోన్ల విషయంలో బాధితులు అప్రమత్తతగా ఉండటం, వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే వాటి రికవరీ ఈజీ అవుతుందని అంటున్నారు నెల్లూరు జిల్లా పోలీసులు. 


నిర్విరామంగా మొబైల్ హంట్.. 
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన CEIR పోర్టల్ ద్వారా ఏపీ పోలీసులు సెల్ ఫోన్ల రికవరీ చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఐదు విడతల్లో సుమారు రూ. 4.35 కోట్ల విలువైన సెల్ ఫోన్లను నెల్లూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని బాధితులకు అప్పగించారు. మొత్తం 1720 సెల్ ఫోన్ లను రికవరీ చేసి భాధితులకు అందజేసినట్టు తెలిపారు. 


సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొనొద్దు..
సరైన బిల్లులు లేని, లేదా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ ని ఎవరూ కొనొద్దని ప్రజలకు సూచించారు నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి. నేటి ఆధునిక సమాజంలో మొబైల్ ఉపయోగించడం నిత్య జీవితంలో ఒక భాగమయిందని, "మొబైల్ హంట్" సేవలను అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫిర్యాదులకోసం కేటాయించిన వాట్సప్ నెంబర్: 9154305600 కి సమాచారం ఇస్తే రికవరీ పని మొదలైనట్టేనని తెలిపారు. ఒక్క మెసేజ్ తోనే స్పందించి రికవరీ మొదలు పెడుతున్నామని చెప్పారు. పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా, FIR నమోదు చేయకుండా కేవలం వాట్సప్ మేసేజ్ ద్వారా జిల్లా పరిధిలో మిస్ అయిన సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇస్తున్నామని చెప్పారు. మొబైల్ ఫోన్ల రికవరీలో శ్రమించిన సైబర్ క్రైమ్ అనాలిసిస్ బృందాన్ని, పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బందిని నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి అభినందించారు. దొంగిలించిన సెల్ ఫోన్లను ఎవరూ మిస్ యూజ్ చేయొద్దని చెప్పారు. అలా చేస్తే అది మరో నేరం కిందకు వస్తుందన్నారు. 


రికవరీ ఎలా..?
పోలీసులు సూచించిన వాట్సప్ 9154305600నెంబర్ కి సమాచారం ఇస్తే వెంటనే గూగుల్ ఫామ్ లింక్ వస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేసి వివరాలు నింపితే వెంటనే కంప్లయింట్ లాడ్జ్ అవుతుంది. ఆ తర్వాత పోలీసులు రికవరీ పని మొదలు పెడతారు.