Fake Votes in Nellore: ఇటీవల నెల్లూరు నగరంలో ఓటర్ల వెరిఫికేషన్ కోసం వచ్చిన నారాయణ విద్యాసంస్థల స్టాఫ్ పై వైసీపీ సానుభూతిపరులు దాడి చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి నారాయణ స్పందించారు. ఓటర్ల వెరిఫికేషన్ కోసం వచ్చేవారిని బెదిరించడం సరికాదన్నారు. అసలు అలాంటి నిబంధనలేవీ లేవని చెప్పారు. ఓటర్ల వెరిఫికేషన్ కోసం వచ్చిన కొంతమందిని పోలీసులు తీసుకెళ్తున్నారని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. తమ తరపున వెరిఫికేషన్ కోసం వస్తున్న వారిని బెదిరిస్తున్నారని, అందుకే తానే నేరుగా వచ్చానని, తనని పోలీసులు పట్టుకెళ్లాలంటూ సవాల్ విసిరారు. తనను పోలీసులు పట్టుకెళ్తారా, తనతో ఉన్న అందర్నీ పట్టుకెళ్తారా.. అంటూ ప్రశ్నించారు నారాయణ.
భయపెడితే ఇక్కడెవరూ భయపడిపోరు..
తాను కూడా పరుషంగా మాట్లాడగలనని, కానీ అలాంటి వ్యాఖ్యలకు తాను దూరం అని చెప్పారు నారాయణ. నెల్లూరులో టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని భయపెట్టాలని చూస్తే ఎవరూ భయపడబోరన్నారు. అలాంటి రాజకీయాలు నెల్లూరులో చెల్లవన్నారు నారాయణ. పట్టణంలో ఎక్కడికెళ్లినా తాను చేసిన అభివృద్ధి గురించి ప్రజలు చెబుతున్నారని, తన హయాంలో వేసిన రోడ్ల గురించి మాట్లాడుతున్నారని, తన హయాంలో ఏర్పాటు చేసిన పార్క్ ల గురించి చెబుతున్నారని వివరించారు. తన హయాంలో అభివృద్ధి జరిగిందని, ఇప్పటికీ ఆ అభివృద్ధే నిలిచి ఉందని చెప్పారు నారాయణ.
నెల్లూరులో దొంగ ఓట్లు..
నెల్లూరు నగరంలో దొంగఓట్లు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు నారాయణ. నగరంలో దొంగఓట్లతో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని అన్నారు. నెల్లూరులో 25వేల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పారు. 9800 మందికి నగరంలో రెండు ఓట్లు ఉన్నాయని చెప్పారు. డబ్లింగ్ ఓట్లతో దొంగ ఓట్లు పడే ప్రమాదం ఉందన్నారు. వాటన్నిటినీ వెరిఫై చేసి తొలగించాలని అధికారులకు సూచించారు.
చంద్రబాబుకి అద్భుత ప్రజాదరణ..
చంద్రబాబుకి అద్భుత ప్రజాదరణ ఉందన్నారు నారాయణ. ఆయనకు జనం నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన ఉండవల్లిలోని నివాసానికి చేరుకోడానికి గంటలకొద్దీ సమయం పట్టిందని, ఆ స్థాయిలో అభిమానులు ఆయనకు రోడ్డు పొడవునా స్వాగతాలు పలికారన్నారు. చంద్రబాబు అనుభవం మళ్లీ రాష్ట్రానికి అవసరం ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పారు నారాయణ.
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు నారాయణ. మంత్రి హోదాలో ఆయన పోటీ చేసినా నగర వాసులు ఆదరించలేదు. ఈసారి తిరిగి అక్కడే పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు. వైసీపీ తరపున ఈసారి కూడా ఆయనకు అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యర్థిగా రాబోతున్నారు. అనిల్ కూడా మంత్రిగా పనిచేసి ఉన్నారు. ఈ మాజీ మంత్రులిద్దరి పోరు నెల్లూరు నగరంలో హోరాహోరీగా జరిగే అవకాశముంది. ఇద్దరూ విస్తృతంగా నగరంలో పర్యటిస్తున్నారు. నెల్లూరు నగరంలో గతంలో నారాయణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఎన్నికలనాటికి అవి సగం సగం పూర్తయ్యాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ సప్లై సిస్టమ్ కోసం రోడ్లు తవ్వేయడం వల్ల ప్రజలు ఎన్నికల టైమ్ లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో కనపడింది. ఇప్పుడు అనిల్ కూడా అభివృద్ధి చేశానంటున్నారు కానీ.. ఒక్క ఫ్లైఓవర్ మాత్రమే కట్టగలిగారు. టీడీపీ హయాంలో మొదలైన నెల్లూరు బ్రిడ్జ్ వైసీపీ హయాంలో పూర్తవడంతో అతి తమ ఖాతాలో వేసుకుంటున్నారు వైసీపీ నేతలు. మిగతా విషయాల్లో నెల్లూరు ప్రజలు వైసీపీ పాలనతో పూర్తి స్థాయి సంతృప్తితో లేరనే చెప్పాలి. ఆ ప్రభావం అంతా ఈ ఎన్నికల్లో కనపడుతుందని వైసీపీ ధీమాగా ఉంది.