Nellore Fire Accident: నెల్లూరులో జరిగిన అగ్ని ప్రమాదంపై ఏపీ పురపాలక మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్ని అన్నీ విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. వారకి త‌క్షణ సాయం కింద ప్రతీ ఇంటికి రూ.15 వేలు, మృతి చెందిన దివ్యాంగురాలికి రూ.30 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.


నెల్లూరు న‌గ‌రం రంగ‌నాయ‌కుల‌పేట‌లోని బ‌ర్మాషెల్ గుంట‌లో భారీ అగ్ని ప్రమాదం జ‌రిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయ‌ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చెందారు. ఈ ప్రమాదంలో దివ్యాంగురాలు మృతి చెంద‌డంపై నారాయ‌ణ స్పందించారు. బాధితుల్ని అన్నీ విధాలా ఆదుకుంటామ‌ని తెలిపారు.


అగ్నిప్రమాదం 6 గ్యాస్ సిలిండర్లు పేలడం కారణంగా జరిగింది. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో 5 పూరి గుడిసెలు తగలబడిపోయాయి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆ మంటల్లో చిక్కుకొని 15 ఏళ్ల వయసు ఉన్న దివ్యాంగురాలు నాగలక్ష్మి చనిపోయింది. స్థానికుల సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. 


కొన్నేళ్లుగా అదే ప్రాంతంలోని ఆ పూరి గుడిసెల్లో కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అక్కడే సిలిండర్లు పేలడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఒక సిలిండర్ పేలడం వల్ల ఆ మంటలతో మరో సిలిండర్ పేలిందని ఇలా 6 బండలు పేలినట్లుగా భావిస్తున్నారు. దీంతో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో లక్షల్లో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పూరిగుడిసెల్లోని వస్తువులు మొత్తం బాగా కాలిపోయి బూడిదయ్యాయి.