ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకి మతిమరుపు అంటూ ఇప్పటివరకూ అనుకున్నామని, కానీ ఆయనకు పిచ్చి పట్టిందని, మామూలు పిచ్చి కూడా కాదని, మదపిచ్చితో చంద్రబాబు ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం చంద్రబాబుకి ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారు. సెంటు స్థలాలు అంటూ వెటకారాలాడుతున్నారని, శవాన్ని పూడ్చుకోడానికి ఆ స్థలం పనికొస్తుందంటూ మదపిచ్చితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి ప్రజలు 2019లోనే రాజకీయ సమాధి కట్టారని, అందుకే ఆయన సమాధులు, శ్మశానాలు అంటూ మాట్లాడుతున్నారని చెప్పారు. 


అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు 
ఏపీ ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నిర్ణయించింది. స్థానికేతరులకోసం అక్కడ ఆర్-5 జోన్ ని ఏర్పాటు చేసి సెంటు స్థలాలు ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే రైతులనుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అక్కడ స్థానికేతరులకు స్థలాలు ఇవ్వడానికి వీల్లేదంటూ రైతులు కోర్టు మెట్లెక్కారు. కానీ కోర్టునుంచి వారికి అనుకూల తీర్పు రాలేదు, ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పునివ్వడంతో ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేశారు అధికారులు. త్వరలో సీఎం జగన్ అక్కడ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఇటీవల పెందుర్తి బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమరావతిలో పేదలకు పంచి పెట్టడానికి సిద్ధం చేసిన సెంటు స్థలం శవాన్ని పూడ్చడానికి మినహా దేనికీ పనికిరాదని ఎద్దేవా చేశారు. దీనిపై వైసీపీ మండిపడుతోంది. సెంటు స్థలం, శ్మశానం అంటూ నిరుపేదల్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు వైసీపీ నేతలు. తాజాగా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కూడా చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అహంకారంతో మాట్లాడుతున్నారని చెప్పారు కాకాణి. 


వెన్నుపోటు భయం..
ఏపీలో అర్జెంట్ గా ఎన్నికలు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారని, అసలు ఎన్నికలు ఎప్పుడు పెట్టాలో ఆయన చెప్పాల్సిన అవసరం లేదన్నారు కాకాణి. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు కుమారుడు లోకేష్.. తానే సొంతగా అసెంబ్లీ టికెట్లు ప్రకటిస్తున్నారని, సొంత వర్గం సిద్ధం చేసుకుని తనకి వెన్నుపోటు పొడుస్తాడని చంద్రబాబు భయపడుతున్నారని, అందుకే తొందరగా ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తొందరపడినంత మాత్రాన ఎన్నికలు జరగవని క్లారిటీ ఇచ్చారు. 


ఇక రైతుల ఉచిత బీమాకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కాకాణి. బడ్జెట్ ప్రసంగం లోనే పూర్తి వివరాలు వెల్లడించామని గుర్తు చేశారాయన. బీమా కింద రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని చెప్పారు. తక్కువ సనయంలోనే పంటల నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇస్తున్నామన్నారు. దిగుబడి లేదా వాతావరణ కారణాల వల్ల పంటకు నష్టం జరిగితే.. వాటికి కూడా పరిహారం చెల్లిస్తున్నామన్నారు.


రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోందని, దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఈ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఏదో ఒక విధంగా ప్రభుత్వం పై బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రైతులు నష్టపోకుండా.. వైసీపీ ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటుందని, ఒకవేళ నష్టం అనివార్యమయితే బీమా పరిహారం ద్వారా వారికి కష్టం లేకుండా చూస్తున్నామని చెప్పారు మంత్రి కాకాణి.