ఏపీ మాజీ మంత్రి బాలినేని ఎపిసోడ్ పై అధికార వైసీపీ గుంభనంగా ఉంది. అధిష్టానం అస్సలేమీ తెలియనట్టే మాట్లాడుతోంది. కప్పులో టీయేలేదు, తుఫాన్ ఎక్కడిదంటూ మీడియాపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన సజ్జల.. బాలినేని కంటతడి పెట్టుకున్న విషయం అసలు తెలియదన్నట్టే ప్రవర్తిస్తున్నారు. వివిధ సందర్భాల్లో మీడియా ముందుకొచ్చిన వైసీపీ నాయకులు కూడా బాలినేని వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టేస్తున్నారు. కానీ జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్ కి మాత్రం ఆ ఎపిసోడ్ పై స్పందించక తప్పలేదు. ఆయనే తొలిసారిగా బాలినేని వ్యవహారంపై స్పందించారు. తప్పంతా మీడియాపై నెట్టేశారు మంత్రి సురేష్. 


బాలినేని కంటతడి పెడుతూ ప్రెస్ మీట్లో మాట్లాడినా ఎక్కడా మీడియాని తప్పుబట్టలేదు. కొంతమంది కావాలని సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టింగ్ లు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. వారెవరో కాదు వైసీపీ నాయకులేనని అన్నారు. తాను టికెట్ ఇప్పించిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు తనకు వ్యతిరేకంగా మారిపోయారన్నారు. వారి పేర్లు మాత్రం బయటపెట్టలేదు బాలినేని. 


బాలినేని పేర్లు బయటకు చెప్పకపోయినా జిల్లా మంత్రిగా ఆదిమూలపు సురేష్ మాత్రం రియాక్ట్ కావాల్సి వచ్చింది. తనకు బాలినేనితో ఎలాంటి పొరపొచ్చాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. తమ మధ్య ఆధిపత్య పోరు లేదన్నారు. బాలినేని వ్యవహారంలో తప్పంతా మీడియాదేనంటున్నారు మంత్రి సురేష్. మీడియా అతి చేస్తోందని, విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఓవైపు బాలినేని సొంత పార్టీ నేతలే తనను ఇబ్బంది పెడుతున్నారంటే, అటు మంత్రి ఆదిమూలపు సురేష్ మాత్రం మీడియానే ఆయనపై కక్షగట్టిందని చెబుతున్నారు. 


అది రాంగ్ రూట్.. 
మార్కాపురం సీఎం సభ ప్రొటోకాల్ వ్యవహారంపై కూడా మంత్రి సురేష్ స్పందించారు. మార్కాపురంలో సీఎం జగన్‌ పర్యటనలో రాకూడని దారిలో వెళ్లడం వల్ల బాలినేని కారు ఆపేశారన్నారు. అది రాంగ్ రూట్ అని అందుకే పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. ఇక బాలినేని అలక, జగన్ ఆయన్ను పిలిపించుకుని ల్యాప్ టాప్ పై బటన్ ప్రెస్ చేయించడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాతే ఆయన పార్టీపై సీరియస్ గా మారిపోయారు. క్రమక్రమంగా పార్టీకి దూరమయ్యేలా ప్రవర్తిస్తున్నారు. 


ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ తొలికేబినెట్ లో బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఆదిమూలపు సురేష్.. ఇద్దరికీ బెర్తులు దక్కాయి. రెండోసారి బాలినేని పదవి ఊడిపోయింది, ఆదిమూలపు సురేష్ మాత్రం జాక్ పాట్ కొట్టారు. రెండోసారి కూడా పదవి చేపట్టారు. దీనికి సామాజిక సమీకరణాలు కలిసొచ్చాయనే వాదన ఉంది కానీ బాలినేని మాత్రం అలిగారు. నిన్న ప్రెస్ మీట్ లో ఏడ్చినంత పని చేశారు. తనని టార్గెట్ చేసింది సొంత పార్టీ నేతలేనంటూ ఓవైపు బాలినేని చెబుతుండగా, మరోవైపు మంత్రి ఆదిమూలపు సురేష్ మాత్రం తప్పు మీడియాదేననడం సంచలనంగా మారింది.


అధిష్టానం స్పందన ఏంటి..?
మంత్రి ఆదిమూలపు సురేష్ తన వరకు బాలినేనితో గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు. మరి ఆయనతో గొడవలున్న ఎమ్మెల్యేలెవరు. స్వయానా ఆయన చలవతో టికెట్లు సాధించి ఎన్నికల్లో గెలిచి, ఇప్పుడు కాలరేగరేస్తున్నవారు ఎవరు..? ఈ విషయం తేలినా తేలకపోయినా.. బాలినేని వ్యవహారంలో అధిష్టానం అతి త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటుందని మాత్రం స్పష్టమవుతోంది. అటు బాలినేని కూడా నియోజకవర్గంపై ఫోకస్ పెడతానంటున్నా, గడప గడపను ఇంకా ప్రారంభించలేదు.