ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 20వ తేదీన ఆయన జిల్లాలోని గుడ్లూరు మండలం మొండివారి పాలెంకు వెళ్లనున్నారు. జిల్లాల పునర్విభజనతో ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు నెల్లూరు జిల్లాలో వచ్చి చేరింది. దీంతో ఇప్పుడు నెల్లూరు జిల్లా అధికారులు సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామాయపట్నం ఓడరేవు శంకుస్థాపన కార్యక్రమం కోసం సీఎం జగన్ గుడ్లూరు మండలం మొండివారిపాలెంకు రాబోతున్నారు. రామాయటప్నం పోర్ట్ ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్నా.. ఇటీవల దానికి అనుమతులు లభించాయి. దీంతో సీఎం జగన్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మొండివారిపాలెం వెళ్తున్నారు. 


జూలై 20వ తేదీ బుధవారం ఉదయం 9.15 గంటలకు ముఖ్యమంత్రి గుడ్లూరుకు చేరుకుంటారు. అక్కడ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం అక్కడే బహిరంగ సభ ఉంటుంది. సీఎం హెలికాప్టర్లో గుడ్లూరు వస్తున్నందున అక్కడ హెలీప్యాడ్ సిద్ధం చేశారు. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొండివారిపాలెంలో వారు పర్యటించారు. సీఎం పర్యటనకు వివిధ శాఖల అధికారులను సన్నద్ధం చేశామని చెప్పారు. 


ఓడరేవు నిర్మాణంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. కర్లపాలెం, ఆవులవారిపాలెం, మొండివారిపాలెం గ్రామాల్లో అర్హులైన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఓడరేవు వల్ల స్థలాలు, పొలాలు కోల్పోతున్నవారికి మెరుగైన నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఓడరేవుతో మరో 3,200 ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఓడరేవుకోసం 2,500 ఎకరాలు కేటాయించామని చెప్పారు. 


బహిరంగ సభ జరిగేది ఎక్కడంటే..
ఓడరేవు శంకుస్థాపన అనంతరం బహిరంగ సభ ఎక్కడ పెట్టాలనేదానిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. శంకుస్థాపన ప్రాంతం సముద్ర తీరానికి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడే సభ పెడితే సముద్ర గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. టెంట్‌ల ఏర్పాటుకు అనుకూలంగా ఉండదని అధికారులు ఆలోచిస్తున్నారు. దీంతో సాలిపేట-రావూరు పొలాల్లో బహిరంగ సభ వేదిక సిద్ధం చేసేందుకు రెడీ అవుతున్నారు. 


ఈ ఏడాది నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ తొలి పర్యటన ఇదే అవుతుంది. గతేడాది వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించేందుకు జగన్ నెల్లూరు వచ్చారు. ఈ ఏడాది సంక్రాంతి నాటికి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ ప్రారంభిస్తానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అవి పూర్తి కాలేదు. కనీసం ఇప్పుడు జిల్లా పర్యటనలో అయినా వాటి గురించిప్రస్తావిస్తారేమో చూడాలి. మరోవైపు సీఎం పర్యటన కోసం అధికారులు, స్థానిక నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.