AP CM YS Jagan Mohan Reddy- కందుకూరు: నా కష్ట సమయాల్లో అండగా నిలిచిన వ్యక్తి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అని, తన అడుగులు ముందుకు పడ్డాయంటే సాయన్న తోడుగా ఉండటమే కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలువలు, విశ్వసనీయత కోసం సాయన్న తనకు తోడుగా నిలిచారని జగన్ పేర్కొన్నారు. ఇలాంటి మంచి వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలని, సాయన్న నెల్లూరుని బాగా చూసుకుంటాడని నమ్మకం ఉందన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన వైసీపీ బహిరంగ సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘చంద్రబాబు చెప్పెవన్నీ అబద్ధాలు, వారిది మోసాల ఫ్యాక్టరీ అయితే, మనం మాత్రం ఇంటింటికి జరిగిన మంచిని ప్రచారం చేస్తున్నాం. చంద్రబాబు ఎన్నో పార్టీలతో జత కడితే, నేను మాత్రం ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నాను. వచ్చే ఐదేళ్ల అభివృద్ధిని, ప్రతీ పేద కుటుంబం భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలు. జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. ఒకవేళ చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు స్వస్తి పలుకుతారు. మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టో తెస్తున్నారు.’ ఏపీ సీఎం వైఎస్ జగన్
నాన్ లోకల్ కిట్టీ పార్టీలు..
హైదరాబాద్ లో ఉండే వారంతా ఎన్నికలు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ కు వచ్చారని, ఎన్నికల్లో ఓడిన వెంటనే మళ్లీ హైదారాబాద్ కు వెళ్లిపోతారని జగన్ విమర్శించారు. ఈ నాన్ లోకల్ కీట్టి పార్టీలకు ఏపీ కేవలం దోచుకునేందుకు.. దోచుకునేది పంచుకునేందుకు అనుకుంటున్నారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర వాళ్లకు లేదన్నారు. 58 నెలల పాలన మీద ప్రోగ్రెస్ రిపోర్టు వాళ్ల ముందు ఉంచి, గత అయిదేళ్లు ఏం చేశామో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని అభ్యర్థులకు, పార్టీ శ్రేణులకు జగన్ దిశా నిర్దేశం చేశారు. ప్రతీ ఒక్కరికీ, ప్రతీగ్రామం, ప్రతీ పట్టణంలోనూ కనీసం ఆరేడు వ్యవస్థలు కొత్తగా ఏర్పాటు చేసి సాధ్యమైనంత మేలు చేశాను, మరోసారి అధికారం ఇస్తే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగుతుందని జగన్ పేర్కొన్నారు.
పాలన బాగుందనుకుంటేనే ఓటు అడగండి
ప్రతిగ్రామంలో గ్రామ వార్డు సచివాలయాలు, 60,70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్ధ తీసుకొచ్చాం. దాదాపుగా 600 రకాల పౌర సేవలతో ఇంటింటికి వెళ్లి పౌరసేవలన్నీ కూడా డోర్ డెలివరీ చేశాం. నాడు - నేడుతో మారిన గవర్నమెంట్ బడి ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఆర్బీకే వ్యవస్థ, విలేజ్ క్లీనిక్ ప్రతి పేదవాడికి అండగా ఉంటాం. డిజిటల్ లైబ్రరీ, పైబర్ గ్రిడ్ వంటి వ్యవస్ధ తీసుకొచ్చాం. ఈ వ్యవస్ధలన్నీ ఇలాగే కొనసాగాలంటే వైసీపీ మళ్లీ రావాలని చెప్పాలన్నారు జగన్.
వైసీపీ పాలనతో 130 బటన్లు నొక్కి రూ. 2 .70 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని, మరో ఐదేళ్లు పథకాలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. అమ్మఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీనేస్తం పథకాలు తెచ్చామన్నారు. రూ. 3 వేలు ఇచ్చే పెన్షన్ ఇంటి వద్ద అందించిన ఘనత తమదేనన్నారు.