Andhra Pradesh News | నెల్లూరు: నగరంలోని భగత్‌సింగ్ కాలనీలో శనివారం 633 మంది లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం శాశ్వత ఇళ్లపట్టాలను అందజేసింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా హాజరుకాగా, జిల్లా మంత్రి పి. నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు పట్టాలు అందించారు.
హామీని నెరవేర్చామన్న మంత్రి నారాయణ
ఈ సందర్భంగా మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలన్న ఉద్దేశంతో నకిలీ ఇళ్లపట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో బాధితుల్ని కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ, వారికి శాశ్వత పట్టాలు ఇస్తానని అప్పట్లో ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు తెలిపారు.
వర్చువల్ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, వారి పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్థానిక మహిళలు మస్తానమ్మ, సయ్యద్ సబీహా సీఎం తో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం రాఖీ పండుగ రోజున ఇళ్లపట్టాలు అందించడం తనకు ఆనందంగా ఉందన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చంద్రబాబు మాట్లాడుతూ, సూపర్ సిక్స్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
-
దేశంలో కూటమి ప్రభుత్వం మాత్రమే 64 లక్షల మందికి రూ.33 వేల కోట్ల పింఛన్లు అందిస్తుంది
-
అన్న క్యాంటీన్లు, రైతు భరోసా, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాలు అమలులో ఉన్నాయి
-
త్వరలో ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభిస్తాం.
-
విద్యుత్ ఖర్చులు తగ్గించేందుకు సోలార్ పవర్‌ను సబ్సిడీతో అందుబాటులోకి తెచ్చాం
-
వ్యయాలను తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం
-
2029 నాటికి పేదరికం లేని సమాజం ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం
-
ఇప్పటికే “P4” కార్యక్రమం కింద 15 లక్షల మంది దాతలు ముందుకు వచ్చారని’ చంద్రబాబు తెలిపారు.
మళ్లీ జన్మ ఉంటే ఇక్కడే పుట్టాలని ఉంది- చంద్రబాబు
లగిశపల్లి: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు దేవుడు సృష్టించిన అద్భుతమని, మరో జన్మ వస్తే ఇక్కడే పుట్టాలని ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా లగిశపల్లిలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, "ఏజెన్సీలో స్వచ్ఛమైన వాతావరణం, అందమైన కొండలు మన కళ్లకు కనువిందు చేస్తాయి. ఇక్కడి ప్రజలు మంచి మనసుతో ఉండే వారు. ఆదివాసీలంటే సహజ నైపుణ్యం, సామర్థ్యం గుర్తొస్తుంది. గిరిజనుల అభివృద్ధి రాష్ట్రాభివృద్ధికి కీలకం. ఎన్టీఆర్ పాలనలోనే గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేసాం. ఇప్పుడూ ఆ దిశగా మేము నడుస్తున్నాం," అన్నారు.
"గిరిజన సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. ఐటీడీఏల్లో ఐఏఎస్‌లను నియమించి, ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. 7 ఐటీడీఏల్లో సమర్థవంతమైన పాలన కోసం అధికారులు కృషి చేస్తున్నారు. అవకాశాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సాధించగలరు. పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. పాఠశాల భవనాల కోసం నిధులు విడుదల చేసాం. వైద్యసేవలను కూడా గిరిజన ప్రాంతాలకు తీసుకువచ్చాం. డోలీ మోతలు వినిపించని గ్రామాలుగా మారుతున్నాయి. నేను సీఎంగా ఉన్నప్పుడు చైతన్యం కార్యక్రమం ప్రారంభించాం. గిరిజనుల్లో చైతన్యం పెరిగితే అభివృద్ధిని అడ్డుకోవడం అసాధ్యం. మీ హక్కులను కాపాడుకుంటూ ముందుకెళితే, జీవితం మెరుగవుతుంది, వెలుగులు సాధ్యం. రాఖీ పండుగ రోజు ఆడబిడ్డలకు పట్టాల పంపిణీ చేయడం సంతృప్తి ఇచ్చిందని " సీఎం చంద్రబాబు వివరించారు.