Weather Today : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడేందుకు అవకాశం ఉందని అందుకే ఆంధ్రప్రదేశ్‌లో ముసురు పట్టుకుందని చెబుతోంది. క్యూములోనింబస్ మేఘాల వల్ల తెలంగాణలో వర్షాలు పడుతున్నాయని నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా నుంచి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు మీదుగా ఏర్పడిన ద్రోణి కొనసాగుతోంది.దీని ప్రభావంతో 13వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ వ్యాప్తంగా పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు, ప్రకాశం,కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జోరు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు.ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో పిడుగులతో కూడిన వాన పడుతుందని చెబుతున్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయి. 

తెలంగాణలో వాతావరణం

తెలంగాణలో కూడా నాలుగు రోజుల పాటు వర్షాలు దంచి కొట్టబోతున్నాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో దక్షిణ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌ కర్నూల్‌, యాదాద్రి భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది. తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వానాలు పడబోతున్నాయి.     

హైదరాబాద్‌లో వాతావరణం 

గత వారం రోజులుగా హైదరాబాద్‌లో ప్రతి రోజూ ఏదో ప్రాంతంలో వర్షం పడుతూనే ఉంది. ఐదు, ఏడో తేదీల్లో మాత్రం నగరవ్యాప్తంగా వాన దంచి కొట్టింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితి మరో నాలుగు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే శుక్రవారం రాత్రి నుంచి జోరుగా వర్షం పడుతోంది.